కేసీఆర్ ఢిల్లీలో గాడిద పండ్లు తోముతున్నారా?

కేసీఆర్ ఢిల్లీలో గాడిద పండ్లు తోముతున్నారా?

హైదరాబాద్: వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందిపడుతోంటే అవేమీ పట్టించుకోకుండా కేసీఆర్ ఢిల్లీలో గాడిద పండ్లు తోముతున్నారా అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీ భవన్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి  కాంగ్రెస్ లో చేరిన పలువురికి రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వర్షాల వల్ల భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని, నష్టం అంచనాకు కేంద్ర బృందాలను రప్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించుకుంటే కేసీఆర్ మాత్రం విపరీతంగా చార్జీలు పెంచుకుంటూ పేదల నడ్డి విరుస్తున్నారని ఫైర్ అయ్యారు.

తండ్రి కొడుకుల చేతిలో రాష్ట్రం బందీ...

కేసీఆర్, కేటీఆర్ చేతుల్లో రాష్ట్రం బందీ అయ్యిందని రేవంత్ విమర్శించారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్న ఆయన... కేసీఆర్ చేతిలో రాష్ట్ర ప్రజలు మోసపోయారని చెప్పారు. విద్యార్థుల త్యాగ ఫలాన్ని కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తోందన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కోట్లాడుతామన్నారు. కాంట్రాక్టుల మీద  శ్రద్ధ తప్ప తండ్రికొడుకులకు పాలన మీదలేదన్నారు. 

బండి సంజయ్ కు పాదయాత్ర చేసే హక్కు లేదు...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన బీజేపీకి  రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కు పాతయాత్ర చేసే నైతిక హక్కులేదని రేవంత్ అన్నారు. మోడీతో సహా బీజేపీ నాయకులందరూ రాష్ట్ర సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల నష్ట పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. తక్షణ సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.1000 కోట్లు కేటాయించాలన్న ఆయన... వర్షాల వల్ల చనిపోయిన వారికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా, పంట నష్ట పోయిన ప్రతి రైతుకు రూ.50 వేలు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

చీకోటి చీకటి కోణంలో టీఆర్ఎస్ నాయకుల పాత్ర...

చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో టీఆర్ఎస్ నాయకులకు కూడా వాటా ఉందని రేవంత్ ఆరోపించారు. చీకోటి చీకటి కోణాలు రోజుకొకటి బయటపడుతుంటే అతడిపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చీకోటి  హవాలా వ్యవహారంలో ఎవరెవరున్నారో జ్యూడిషయల్ ఎంక్వైరీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గుట్కా, గంజాయి లేదన్న కేసీఆర్... క్యాసినో విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలన్నారు. ఏ ఏ  సినిమాలు చూడాలో ప్రజాభిప్రాయాలను సేకరించే కేటీఆర్... హవాలా విషయంలో చర్యలు తీసుకోకుండా  ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాలు విరిగిందని కొడుకు, కాంట్రాక్టుల కోసం ఢిల్లీలో తండ్రి ఉండి... రాష్ట్రాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. 

ఆగస్టు 9 నుంచి 15 వరకు విజయ్ ఉత్సవాలు...

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా  ఆగస్టు 9 నుంచి 15 వరకు కాంగ్రెస్ ఆధ్యర్యంలో విజయ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లా నాయకుడు 75 కిలో మీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ గొప్పదనం గురించి చెప్పాలన్నారు. అలాగే ఆగస్టు 5న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.