థర్మల్ ప్రాజెక్టుల పనుల్లో.. 15 వేల కోట్ల దోపిడీ : రేవంత్​రెడ్డి

థర్మల్ ప్రాజెక్టుల పనుల్లో.. 15 వేల కోట్ల దోపిడీ : రేవంత్​రెడ్డి
  • థర్మల్ ప్రాజెక్టుల పనుల్లో.. 15 వేల కోట్ల దోపిడీ
  • ఉచిత విద్యుత్​ పేరుతో కేసీఆర్‌‌‌‌ కుటుంబం భారీ అవినీతి: రేవంత్​రెడ్డి
  • కరెంట్‌‌పై చర్చకు ఎక్కడికైనా వస్తదమ్ముంటే ఎక్కడికి రావాలో కేటీఆర్​ చెప్పాలి
  • బీఆర్​ఎస్​ లీడర్లను నిలదీయాలని కాంగ్రెస్​ కేడర్​కు పిలుపు

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ వచ్చాక మొదలు పెట్టిన థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణంలో రూ.15 వేల కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలోనే తక్కువ ధరకు కరెంటు ఇస్తామని కేంద్రం ముందుకొచ్చినా కేసీఆర్ వినలేదని, తన అవినీతి కోసం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీపీఎస్, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టులు కలిపి రూ.45,730 కోట్లకు టెండరు పిలిచారని, ఇది చాలా ఎక్కువ అని రేవంత్ అన్నారు. 

ఇతర రాష్ట్రాల్లో ఒక్కో మెగావాట్‌కు రూ.5.5 కోట్ల నుంచి రూ.6.8 కోట్ల ఖర్చుతో థర్మల్ ప్రాజెక్టులు నిర్మిస్తే, తెలంగాణలో ఒక్కో మెగావాట్‌కు రూ.9.7 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారన్నారు. అంచనాలు భారీగా చూపించి నిర్మాణ సంస్థల నుంచి రూ.15 వేల కోట్లు (30శాతం) కేసీఆర్ కమీషన్‌గా తీసుకున్నారని ఆరోపించారు. కేటీపీఎస్‌లో రూ.945కోట్లు, భద్రాద్రి ప్రాజెక్టులో రూ.4,538 కోట్లు, యాదాద్రి ప్రాజెక్టులో రూ.9,384 కోట్ల దోపిడీ జరిగిందన్నారు. పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన సివిల్ పనులను కేసీఆర్ తన అనుయాయులకు అప్పగించారని ఆరోపించారు. బీహెచ్ఈఎల్ నుంచి ఏ ధరకు ఏయే కంపెనీలకు పనులు అప్పగించారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

తొమ్మిది వేల కోట్ల దోపిడీ

కాంగ్రెస్‌ను, తనను తిట్టకుండా కేసీఆర్ కుటుంబానికి పూట గడవడం లేదని రేవంత్‌ అన్నారు. రైతులకు అవసరం ఉన్న మేరకే త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని ఈ ఏడాది జనవరి 30వ తేదీన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌‌రావు చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ సర్కార్ రైతులకు 24 గంటలు ఇవ్వడానికి కరెంట్ కొన్నట్టు చెప్తూ, 8 గంటల నుంచి 10 గంటలకు మాత్రమే ఇస్తున్నదని ఆరోపించారు. ఈ తప్పుడు లెక్కలతో ఏడాదికి రూ.8 నుంచి 9 వేల కోట్లను కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్నదన్నారు. ఇదే విషయాన్ని తాను చెబితే బీఆర్‌‌ఎస్ లీడర్లు తెగ ఎగురుతున్నరని మండిపడ్డారు. దీనిపై రైతు వేదికల వద్దకు వచ్చి చర్చించేందుకు తాను, తన పార్టీ లీడర్లు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎక్కడికి రమ్మన్నా వస్తామని, దమ్ముంటే కేటీఆర్, హరీశ్‌, కేసీఆర్‌‌ తన సవాల్‌ను స్వీకరించాలన్నారు.

ALSO READ:75 లక్షల మంది రైతులను తిప్పలు పెడ్తున్న ధరణి: కిషన్​రెడ్డి

దుడ్లు, బుడ్లు, బెడ్లే కేటీఆర్‌‌కు తెలుసు

రాహుల్​​గాంధీకి వ్యవసాయం తెలియదని కేటీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌‌కు దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప వ్యవసాయం అంటే ఏందో తెలియదని విమర్శించారు. రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కేటీఆర్‌‌ను అడ్డుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులకు రుణమాఫీ చేసేవరకు, పోడు భూములకు పట్టాలు ఇచ్చేవరకు, 24 గంటల కరెంట్ సరఫరా చేసే వరకు రైతు వేదికలకు తాళాలు వేసి రైతులు, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

భయమెందుకు

“బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులు.. వారిద్దరిది ఫెవికాల్ బంధం. కేసీఆర్ ఈసారి మళ్లీ గజ్వేల్ లో పోటీ చేయాలి. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి. కేసీఆర్ పాలనకు ఇదే రెఫరెండం లాంటిది. మూడోసారి అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ కు గజ్వేల్ లో పోటీ చేయడానికి భయం ఎందుకు? సిట్టింగులకు సీట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని రేవంత్ ప్రశ్నించారు.