75 లక్షల మంది రైతులను తిప్పలు పెడ్తున్న ధరణి: కిషన్​రెడ్డి

75 లక్షల మంది రైతులను తిప్పలు పెడ్తున్న ధరణి: కిషన్​రెడ్డి
 
  • సర్కార్​ది తప్పులేనట్లు.. ప్రైవేట్​ కంపెనీతో ప్రకటనలా?
  • 75 లక్షల మంది రైతులను తిప్పలు పెడ్తున్న ధరణి: కిషన్​రెడ్డి
  • పోర్టల్​ నిర్వహిస్తున్న కంపెనీతో పత్రికల్లో యాడ్స్​ ఏంది? 
  • బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరోసా ఏది?
  • సర్కారు తప్పులను చూపించే మీడియాపై నిషేధాలెందుకు? 
  • కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తున్నదని విమర్శ
  • పోర్టల్​ నిర్వహిస్తున్న కంపెనీతో పత్రికల్లో యాడ్స్​ ఏంది? 
  • బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరోసా ఏది?
  • సర్కారు తప్పులను చూపించే మీడియాపై నిషేధాలెందుకు? 
  • నిజాం పాలనను తలపిస్తున్న కేసీఆర్ పాలన అని విమర్శ

హైదరాబాద్, వెలుగు:  ధరణి పోర్టల్​లో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్​రెడ్డి మండిపడ్డారు. ‘‘ధరణి పోర్టల్ ను నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా సోమవారం కొన్ని దినపత్రికల్లో కేసీఆర్ సర్కార్  ప్రకటన విడుదల చేయించడం చూస్తుంటే.. ధరణిలో తమకు తప్పు తెలియదన్నట్లుగా సర్కారు చేతులు కడుక్కున్నట్లు ఉంది” అని విమర్శించారు. ధరణి కారణంగా తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా రాష్ట్రంలోని 75 లక్షల మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో కిషన్​రెడ్డి తెలిపారు. ‘‘ధరణిని అడ్డుపెట్టుకొని ప్రజల ఆస్తులను కబ్జా చేసుకుంటున్న వాళ్ల నుంచి ఆ ప్రజలకు  భరోసా కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. తన అసమర్థతను బయటపడనీయకుండా సదరు కంపెనీ ద్వారా  దుర్మార్గమైన ప్రకటన చేయించడం ఏమిటి?” అని ప్రశ్నించారు. 

ధరణిపై ప్రజల్లో గందరగోళం నెలకొన్నప్పుడు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై లేదా అని నిలదీశారు. ప్రభుత్వపరంగా బాధ్యత వ్యవహించాల్సింది పోయి మీడియాను, ప్రతిపక్షాలను విమర్శించడం ఏమిటని మండిపడ్డారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులను బాధ్యులుగా చూపించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, ఇది అనైతిక పద్ధతులకు, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ‘‘మారుతున్న సాంకేతికత నేపథ్యంలో.. డేటా గోప్యత ఓ కీలకమైన అంశం. ప్రభుత్వ వెబ్‌సైట్లు, ప్రభుత్వ సంబంధిత అంశాల డేటా విషయంలో గోప్యతను కాపాడే సంపూర్ణ బాధ్యత ప్రభుత్వానిదే.  ధరణి డేటాలోనూ రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత” అని తెలిపారు. సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి ధరణి పేరిట కొత్త సమస్యలను సృష్టించారని మండిపడ్డారు. 

లండన్‌లో కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

న్యూయార్క్ పర్యటన ముగించుకుని లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి  ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ -యూకే విభాగం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేండ్లలో మోదీ సర్కారు చేపట్టిన కార్యక్రమాలను, ఈ సందర్భంగా భారతీయ సమాజంలో వచ్చిన మార్పులను వివరించారు. కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే విభాగం అధ్యక్షుడు  కుల్‌దీప్ షెకావత్, ప్రధానకార్యదర్శి  సురేశ్ మంగళగిరి తదితరులు పాల్గొన్నారు. 

21న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ నెల 21 న ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి పార్టీ స్టేట్ ఆఫీసులో బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రి హోదాలో విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 19 న ఢిల్లీకి రానున్న కిషన్​రెడ్డి.. ఈ నెల 20 న ఇబ్రహీంపట్నం మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్లను  పరిశీలించనున్నారు. 21న పార్టీ స్టేట్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారు.  

ALSO READ:కరెంట్​ ఎన్ని గంటలన్నది.. ముఖ్యం కాదు : ట్రాన్స్​కో సీఎండీ 

ప్రభుత్వ తప్పులను చూపిస్తే మీడియాపై నిషేధమా?

ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదేండ్లుగా అప్రజాస్వామిక, నిజాం నిరంకుశపాలన కొనసాగుతున్నదని కిషన్​రెడ్డి అన్నారు. ‘‘ఈ సర్కార్  తప్పులను ప్రశ్నించేవాళ్లను, నిర్ణయాలకు వ్యతిరేకంగా గళమెత్తే వాళ్లను అడ్డంగా తొక్కిపడేస్తున్నరు. ప్రభుత్వ తప్పులను, ప్రజా సమస్యలను చూపించే  V6 చానల్‌ను, వెలుగు పత్రికను నిషేధించారు. గతంలో కూడా  వివిధ పత్రికలు, చానళ్లను బ్యాన్ చేశారు. తమ అసమర్థతను ప్రజలకు చూపించే టీవీ చానళ్లను 10 కిలో మీటర్ల లోతున పాతిపెడ్తానన్న కేసీఆర్ మాటలను ఇంకా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. 

పాత్రికేయులెందరినో  కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు బహిరంగంగానే బెదిరించడం, అర్ధరాత్రి పాత్రికేయుల ఇండ్లపై దాడిచేసి అరెస్టులు చేయడం, కూరగాయలకు వెళ్తున్నవాళ్లను పట్టుకుని మఫ్టీ పోలీసులతో కిడ్నాపులు చేయించి బెదిరించడం వంటివి ప్రజల కండ్లముందు మెదులుతూనే ఉన్నాయి” అని తెలిపారు. నాటి నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రజలు చూసిన అరాచకాలన్నీ నేటి కేసీఆర్ పాలనలో చూస్తున్నారని అన్నారు. ‘‘అధికారం కోసం ఎంతకైనా తెగించడం, తమను ఎదిరించేవారిని అథపాతాళానికి తొక్కేయడం లక్ష్యంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా కల్పించకుండా కల్వకుంట్ల కుటుంబం అహంకార పూరితంగా వ్యవహరిస్తుండటంతో ధరణి వంటి సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి” అని ఆయన మండిపడ్డారు.