కరెంట్​ ఎన్ని గంటలన్నది.. ముఖ్యం కాదు : ట్రాన్స్​కో సీఎండీ

కరెంట్​ ఎన్ని గంటలన్నది.. ముఖ్యం కాదు : ట్రాన్స్​కో సీఎండీ

 

  • కరెంట్​ ఎన్ని గంటలన్నది.. ముఖ్యం కాదు
  • 24 గంటల ఫ్రీ కరెంట్​పై ట్రాన్స్​కో సీఎండీ దాటవేత
  • ‘నాణ్యమైన విద్యుత్​ ఇస్తున్నం కదా’ అంటూ అసహనం

వేములవాడ, వెలుగు:  24 గంటల ఉచిత కరెంట్​పై టీఎస్​ట్రాన్స్​ కో, జెన్​ కో సీఎండీ ప్రభాకర్​రావు సమాధానం దాటవేశారు. కరెంట్​ ఎన్ని గంటలు ఇస్తున్నామన్నది ముఖ్యం కాదని, నాణ్యమైన కరెంట్​ ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్​కు, రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. సోమవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గెస్ట్ హౌస్​ లో మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ప్రభాకర్​రావును మీడియా ప్రతినిధులు.. 24గంటల కరెంట్​పై ప్రశ్నించారు. ఇదే అంశంపై నాలుగైదు రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్​మధ్య పోటాపోటీ ఆందోళనలు కొనసాగు తున్న విషయాన్ని ప్రస్తావించారు. దీనికి ఆయన దాటవేత సమాధానం ఇచ్చారు. కరెంట్ ఎన్ని గంటలు ఇస్తున్నామన్నది ముఖ్యం కాదని, ఎక్కడా పంటలు ఎండిపోయినట్టు తమ దృష్టికి రాలేదని అన్నారు. ఈసారి15,497 మెగావాట్ల పీక్​ డిమాండ్ ఉన్నా సరఫరా చేయగలిగామని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను సరిదిద్దుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో అగ్రికల్చర్​ సర్వీసెస్​ ఎక్కువగా ఉన్నాయని, ఎక్కడా విద్యుత్​ అంతరాయం లేదని ఆయన అన్నారు. ఎండకాలం ఉన్నంత లోడ్​ ఇప్పుడు కూడా ఉందని తెలిపారు. లాస్ట్ ఇయ ర్ కన్నా ఈసారి సుమారు 4,000 మెగావాట్ల మేరకు ఎక్కువ వినియోగం ఉందని, సీఎం కేసీఆర్​ ఆదేశాలతో ప్రతిరోజు రూ.25 కోట్లతో ఎక్సెస్​ సప్లై 
ఇస్తున్నామని వివరించారు. 

ALSO READ :కాలనీల్లో సమస్యలపై .. సిటిజన్స్ మేనిఫెస్టో!

మీరు ఏ రిపోర్టర్​?

24 గంటల ఫ్రీ కరెంట్​పై మీడియా ప్రతినిధుల ప్రశ్నలపై ట్రాన్స్​ కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య 24 గంటల ఉచిత విద్యుత్​ బర్నింగ్ ఇష్యూ నడుస్తున్నది.  రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అమలువుతున్నదా? ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యుత్ సబ్ స్టేషన్​లో లాగ్​బుక్స్​లో రికార్డ్స్ చూపించి 24 గంటల కరెంట్ రావడం లేదని చెప్పారు. దీనిపై మీ కామెంట్ ఏమిటి?” అని వీ6 –వెలుగు ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘మాకు పాలిటిక్స్​తో సంబంధం లేదు. నాణ్యమైన విద్యుత్​ సరఫరా చేస్తున్నం. మేం చెప్తున్నం కదాండీ.. మేం నాణ్యమైన విద్యుత్​ ఇస్తున్నమని చెప్తున్నం కదా?” అంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇంతకుముందు కరెంట్ ఉంటే వార్త, ఇప్పుడు కరెంట్ లేకుంటే వార్త” అంటూ ప్రెస్​మీట్ మధ్యలో నుంచే వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ.. ‘‘మీరు ఏ రిపోర్టర్​” అని ప్రశ్నించారు.