కాలనీల్లో సమస్యలపై .. సిటిజన్స్ మేనిఫెస్టో!

కాలనీల్లో సమస్యలపై .. సిటిజన్స్ మేనిఫెస్టో!

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్ హైదరాబాద్‌‌లో ‘సిటిజన్స్ మేనిఫెస్టో’ తయారైతున్నది. తమ కాలనీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు మేనిఫెస్టోను రెడీ చేస్తున్నాయి. వీటిని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (యుఫెర్వాస్) సేకరిస్తున్నది. గ్రేటర్‌‌‌‌లో ఉన్న 4,300 కాలనీల నుంచి వివరాలు సేకరించి, అందులో ప్రధానంగా ఉన్న 10 సమస్యలను మేనిఫెస్టో రూపంలో సిద్ధం చేయనుంది. ఆ మేనిఫెస్టోను సిటీలోని 25 నియోజకవర్గాల్లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకు అందజేయనుంది. 

కొన్ని రోజుల కిందట ఈ ప్రక్రియ ప్రారంభించగా.. ఇప్పటిదాకా 20 కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ల నుంచి వివరాలు అందాయి. అన్ని కాలనీల నుంచి వివరాలు తీసుకొన్న తర్వాత మేనిఫెస్టో రూపొందించి.. అభ్యర్థులకు అందజేస్తామని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. 2018 ఎన్నికల్లోనూ ఇలానే అభ్యర్థులకు మేనిఫెస్టో అందజేయగా.. కొన్ని పనులు జరిగాయని వివరించింది. ఈ సారి మరింత పకడ్బందీగా మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు చెప్పింది.

ALSO READ :24 గంటల కరెంటుపై చర్చనట
 

ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపిస్తున్న అన్ని పార్టీల నేతలు.. ఎన్నికల తర్వాత పట్టించుకోవడం లేదని సిటిజన్లు ఆరోపిస్తున్నారు. ఎన్ని సార్లు అడిగినా స్పందించడం లేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే పని లేకుండా.. వినూత్న కార్యక్రమాన్ని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టింది. కాలనీల్లో ఉన్న ప్రధాన సమస్యలను.. ఆయా పార్టీల అభ్యర్థులకు తెలియజేసి, పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతున్నది. ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే తమ సమస్యలను పరిష్కరిస్తామని పార్టీల మేనిఫెస్టోలో పొందుపర్చాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. గ్రేటర్‌‌‌‌లోని 25 నియోజకవర్గాల్లోని 4,300 కాలనీల్లో ఉన్న సమస్యల వివరాలను వచ్చేనెల లోపు యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేకరించనుంది. ప్రధానంగా రోడ్లు, వాటర్ ప్రాబ్లమ్, డ్రైనేజీ, పార్కులు, కాలుష్యం, నీటి వనరులను పొదుపు చేయడం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌‌పై నిషేధం తదితర అంశాలపై సిటిజన్స్ మేనిఫెస్టో రూపొందించి ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకు అందజేయనుంది.

సమస్యలు పరిష్కారమైతయనే..

సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిటిజన్స్ మేనిఫెస్టో ప్రిపేర్ చేస్తున్నం. నియోజకవర్గంలో ఏయే సమస్యలు ఉన్నాయో పోటీ చేస్తున్న వారికి తెలియాలె. అన్ని కాలనీల్లో ఏయే సమస్యలు ఉన్నాయో తీసుకొని, అందులోంచి 10 సమస్యలని ఎంపిక చేసి, ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకి ఇస్తాం. ఆ సమస్యల పరిష్కారం కోసం వాటిని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరుతాం. ఈ విధంగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాం.

- బీటీ శ్రీనివాసన్, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్