- మేడారంలో వనదేవతల కొత్త గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్
- కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు చెల్లింపు
- మనుమడితో కలిసి తల్లులకుతులాభారం.. బంగారం సమర్పణ
- భక్తులను పలకరిస్తూ షేక్‌హ్యాండ్ సీఎం, మంత్రులు సహా అధికారులకు
- పట్టు బట్టలు పెట్టిన మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: వనదేవతలకు నిలయమైన మేడారంలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్తగా రూపుదిద్దుకున్న సమ్మక్క, సారక్క గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. మంత్రులతో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆదివారం మేడారంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాత్రి అక్కడి హరిత హోటల్‌లో బస చేశారు. సోమవారం ఉదయం 6:20 గంటలకు కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి తల్లుల గద్దెల వద్దకు చేరుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం సీఎంకు ప్రధాన పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క, సారక్క గద్దెల పునఃప్రారంభ పైలాన్‌ను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ ఆవిష్కరించారు. తర్వాత కుటుంబసభ్యులతో కలిసి వన దేవతలకు మొదటి మొక్కులు చెల్లించారు. పసుపు, కుంకుమ, చీరె, సారె, బంగారం(బెల్లం) సమర్పించారు. తన మనవడు రుద్రదేవ్తో కలిసి తులాభారం వేసి.. 68 కిలోల బంగారం దేవతలకు సమర్పించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘నేను 2023 ఫిబ్రవరి 6న మేడారం నుంచే హాత్ సే హాత్ జోడోయాత్ర ప్రారంభించాను. సీఎం అయ్యాక తల్లుల చరిత్ర వెయ్యేళ్లు నిలిచేలా సంక్పలం తీసుకుని అభివృద్ధి పనులు పూర్తిచేసుకున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వివేక్‌వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ పట్టు బట్టలు..
పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, సారక్క పూజారి కాక సారయ్య అమ్మవార్ల కంకణాలు అందజేయగా... మంత్రులు సీతక్క, కొండా సురేఖ సీఎం, ఇతర మంత్రులకు కట్టారు. సీఎం రేవంత్, మంత్రులకు సీతక్క స్వయంగా బొట్టు పెట్టారు. గద్దెల ఆవరణలో వారిని వరుసగా కూర్చోబెట్టి వన దేవతల సంప్రదాయ వస్త్రాలను అందజేశారు. సీఎస్, డీజీపీ, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులకు కూడా పట్టు వస్త్రాలు అందజేశారు. ఆదివాసీల చరిత్రను చిరస్థాయిలో నిలిపిన సీఎంకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా సీతక్క పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ, అభివృద్ధి పనులను రూ.251 కోట్లతో చేపట్టింది. పోయినేడాది సెప్టెంబర్23న పనులకు సీఎం శ్రీకారం చుట్టగా, సరిగ్గా మూడు నెలలకు డిసెంబర్24న గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను పునఃప్రారంభించారు.
భక్తులతో మాట్లాడిన సీఎం..
గద్దెల పునఃప్రారంభ కార్యక్రమానికి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు భారీగా తరలివచ్చారు. వాళ్లంతా సీఎంకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఆయన భక్తుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘జై రేవంత్అన్న’, ‘జై సీతక్క’ అంటూ మహిళలు నినాదాలు చేశారు. అనంతరం ఉదయం 7:40 గంటలకు సీఎం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్దివాకర టీఎస్, ఎస్సీ సుధీర్రాంనాథ్కేకన్, ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
