చెలమల కృష్ణారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ 

చెలమల కృష్ణారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ 

మునుగోడు బై పోల్ కు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఖరారు చేసిన నేపథ్యంలో.. టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ నేతలను బుజ్జగించే పనిలో టీపీసీసీ నిమగ్నమైంది. టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురైన మునుగోడు నేత చెలమల కృష్ణా రెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ కి అండగా ఉండాలని కృష్ణారెడ్డి కి రేవంత్ నచ్చచెబుతున్న ట్లు తెలుస్తోంది. మరోవైపు మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా రేవంత్ ఇంటికి వెళ్లారు. పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణా రెడ్డి ఇద్దరిని కూర్చొబెట్టి పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.

నాయకులు అందరూ ఐకమత్యంతో పనిచేసి మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ కు విజయాన్ని సాధించిపెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం శుక్రవారం రోజున సూచించింది. ఈమేరకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా నిన్న ఓ పోస్ట్ చేశారు. తన పోస్ట్ తో పాటు పాల్వాయి స్రవంతిని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం జారీ చేసిన లేఖను ఆయన ట్యాగ్ చేశారు. 

మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో చెల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు పల్లె రవి, కైలాష్ నేత కూడా ఉన్నారు. వీరిని బుజ్జగించేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు  ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక  సమావేశం జరగనుంది. దీనికి కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మధుయాష్కీ, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరవుతారు.