గ్రామ సభలు పెట్టకుండా మాస్టర్ ​ప్లాన్ ఎట్లా అమలు చేస్తరు

గ్రామ సభలు పెట్టకుండా మాస్టర్ ​ప్లాన్ ఎట్లా అమలు చేస్తరు

హైదరాబాద్​, వెలుగు:  గ్రామ సభలు పెట్టకుండా, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​ను ఎలా అమలు చేస్తారని  పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. మాస్టర్​ ప్లాన్​లో భాగంగా రైతుల పొలాలను ఇండస్ట్రియల్​ జోన్​కు వాడుకోవడం వల్ల.. చిన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. దీనికి మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​దే పూర్తి బాధ్యత అని విమర్శించారు. ప్లాన్​ను రద్దు చేయాలంటూ కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి రైతులు నెల రోజులుగా ధర్నాలు చేస్తున్నా సర్కారు స్పందించకపోవడం దారుణమని, రైతులను కేసీఆర్​ సర్కార్​ చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు. 

గురువారం ఆయన ఈ విషయంపై సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. సీఎం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి వెంటనే రూ.కోటి పరిహారం ఇవ్వాలని, అతడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కామారెడ్డి మాస్టర్​ప్లాన్​ ముసాయిదాను రైతుల ముందు పెట్టాలని, ప్రజా సభల్లో చర్చించాకే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. కలెక్టరేట్ల వద్ద రైతులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.