సీఎం కేసీఆర్ అరాచకాలు హద్దు దాటుతున్నాయి

 సీఎం కేసీఆర్ అరాచకాలు హద్దు దాటుతున్నాయి
  • పొలాలకు నీళ్లు కాదు.. రైతుల 'కళ్లలో నీళ్లు తిరుగుతున్నయి
  • సీఎం కేసీఆర్ పై మండిపడిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
  • శ్రీ గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
  • లేకుంటే వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో, రైతుల పొలాలకు నీళ్ల పేరుతో సీఎం కేసీఆర్​ చేస్తున్న అరాచకాలు హద్దు దాటుతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతుల పొలాలకు నీళ్ల సంగతి దేవుడెరుగు.. వారి కళ్లలో మాత్రం నీళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు బేడీలు వేసి వేధించడంపై శుక్రవారం సీఎం కేసీఆర్​కు రేవంత్ లేఖ రాశారు. ప్రాజెక్టుల కోసం రైతులు పెద్ద మనసుతో భూములిస్తే.. ఇప్పుడు నిర్వాసితులుగా వారికి ఏం మిగిలిందన్నారు. పరిహారం అడిగిన పాపానికి వారిపై లాఠీచార్జ్ చేసి దౌర్జన్యంగా ప్రవర్తించారని, బేడీలు వేసి గజదొంగల్లా వారిని ట్రీట్ చేయడం ఆటవిక చర్య అని మండిపడ్డారు. అన్నదాత చేతికి సంకెళ్లు వేయడం, తెలంగాణ సమాజం జీర్ణించుకోలేని దృశ్యమన్నారు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

కేసులను వాసప్​ తీసుకోవాలె
నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని, రైతులపై పెట్టిన కేసులను వాపస్ తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టుకు.. రీడిజైన్ చేయడం వల్ల ముంపు గ్రామాల సంఖ్య 1 నుంచి 8కి పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఏ మూలకుపోయినా ఎకరం ధర రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు తక్కువ లేదని మీరే చెబుతున్నారని, గౌరవెల్లి నిర్వాసితులకు ఆ ధర ఎందుకు వర్తింపజేయట్లేదని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించి 8 ఏండ్లాయినా 186 మందికి పరిహారమే అందలేదన్నారు. నిర్వాసితులు కోరుకున్నట్లు  ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, డబుల్ ఇండ్లు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, లేకుంటే వారి న్యాయమైన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని రేవంత్ ప్రకటించారు.