పార్టీ పేరు మార్చడానికి వీల్లేదని ఈసీని కోరుతా : రేవంత్

పార్టీ పేరు మార్చడానికి వీల్లేదని ఈసీని కోరుతా : రేవంత్
  •      2017లో టీఆర్​ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు వందల కోట్లు వసూలు చేసిన్రు
  •     ఈ అక్రమాలపై గతంలోనే ఈసీకి ఫిర్యాదు చేసిన 
  •     టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీకి పీకే సంధానకర్త అని ఆరోపణ

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్​ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు 2017లో ‘గులాబీ కూలీ’ పేరిట వందల కోట్ల చందాలు వసూలు చేశారని, దీనిపై ఎంక్వైరీ జరగాల్సిందేనని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. అప్పటి వరకు టీఆర్​ఎస్​ పేరు మార్చడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతానని చెప్పారు. రాహుల్‌‌ గాంధీ చేపట్టిన భారత్‌‌ జోడో యాత్రపై శనివారం గాంధీ భవన్‌‌లో ముఖ్య నాయకులతో రేవంత్​ సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2017లో వరంగల్‌‌లో టీఆర్‌‌ఎస్‌‌ ప్లీనరీ కోసం గులాబీ కూలీ పేరుతో టీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు వందల కోట్లు వసూలు చేశారు. వేతనాలు తీసుకొనే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉద్యోగులకిందకే వస్తారు. అలాంటి వాళ్లు ప్రజల నుంచి చందాలు వసూలు చేయడం చట్ట విరుద్ధం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి ప్రకారం రూ. 20 వేల కన్నా ఎక్కువ నగదు తీసుకోరాదు. కానీ గులాబీ కూలీ పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని పార్టీ లెక్కల్లో చూపించలేదు. దీనిపై నేను గతంలోనే ఈసీకి కంప్లైంట్‌‌ చేసిన. విచారణ చేయలేమని కేంద్ర ఎన్నికల సంఘం 2019లో సీబీడీటీకి లేఖ రాసింది. ఈ పిటిషన్​ పెండింగ్​లో ఉంది. గులాబీ కూలీ పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిగేదాకా టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ పేరు మార్చడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతా” అని అన్నారు. చందాలపై ఐదేండ్లుగా సీఈసీకి సమాధానం చెప్పకుండా తిరుగుతున్న ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అని దుయ్యబట్టారు.  

టీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటే

టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. రాజ్యసభలో టీఆర్‌‌ఎస్‌‌ పక్షాన్ని బీజేపీలో త్వరలోనే విలీనం చేస్తారని ఆరోపించారు.  ‘‘తమ ఫోన్లు ట్యాప్‌‌ చేస్తున్నారని, తమ వెంట సీబీఐ, ఈడీ పడుతున్నాయని కేటీఆర్‌‌ చెప్తూ బీజేపీ, టీఆర్‌‌ఎస్‌‌ మధ్య వార్‌‌ నడుస్తున్నట్టు క్రియేట్‌‌ చేస్తున్నడు. పశ్చిమ బెంగాల్‌‌లో టీఎంసీని మళ్లీ గెలిపించడానికి పన్నిన వ్యూహాన్ని ప్రశాంత్‌‌ కిశోర్‌‌ తెలంగాణలోనూ అమలు చేస్తున్నడు. అప్పుడు మమత, మోడీ మధ్య చక్రం తిప్పింది, ఇప్పుడు కేసీఆర్‌‌, మోడీ మధ్య ఉండి నడిపిస్తున్నది కూడా పీకేనే” అని విమర్శించారు. గులాబీ కూలీ విషయంలో ఈటల రాజేందర్‌‌, ఇతర బీజేపీ లీడర్లు మాట్లాడాలని డిమాండ్​ చేశారు. రాహుల్‌‌గాంధీ యాత్రపై కేటీఆర్‌‌ కామెంట్‌‌ చేయడం ఏమిటంటూ మండిపడ్డారు. ‘‘కేటీఆర్‌‌ ఉదయం ఒకపనిలో, సాయంత్రం ఇంకో పనిలో బిజీగా ఉంటడు. ముందు ఆయన ఆ పనులు సరిచూసుకోవాలి”అంటూ విమర్శించారు. చివరి వారంలో రాహుల్‌‌ యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందన్నారు. మక్తల్‌‌ నియోజకవర్గంలో ప్రారంభమయ్యే యాత్ర 15 రోజులు కొనసాగి జుక్కల్‌‌ నియోజకవర్గంలో ముగుస్తుందన్నారు. సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌‌ బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ పాదయాత్ర పర్యవేక్షకులు బైజు, సుశాంత్‌‌ మిశ్రా పాల్గొన్నారు.