కాంగ్రెస్‭లో తప్పులు సహజం..మేము మనుషులమే : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‭లో తప్పులు సహజం..మేము మనుషులమే : రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరగడం కామన్ అని.. అయినా తామందరూ మళ్లీ కలిసిపోతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‭లో చేతులే కాదు తమ మనసులు కూడా కలవాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజలకు నష్టం జరిగే చర్యలకు ఎవరూ పాల్పడరని చెప్పారు. పెద్ద దిక్కులేని వ్యవస్థ దెబ్బతింటుందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, సంపత్ కుమార్‭ల విజ్ఞప్తి తాను ఆమోదిస్తున్నానని చెప్పారు. 

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని కొందరు కావాలనే కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. రక్తం గడ్డ కట్టే చలిలో కూడా ఆయన దేశ ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. దేశ రాజకీయాలు, బీజేపీ అరాచకాలు, మతతత్వ శక్తుల గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నామని.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అందరూ గమనించాలని రేవంత్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు స్వేచ్చగా బతకాలన్నారు. ప్రజలు తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒకే కుటుంబపాలన కోసం తెలంగాణను సాధించుకోలేదని చెప్పారు. అందమైన అబద్దాలతో ప్రజలను కేసీఆర్ మోసం చేసిండని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ ప్రజలను నయవంచన చేస్తున్నాడని రేవంత్ ఆరోపించారు.