
- రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తున్నదని ఫైర్
- ఓయూలో శ్రీకాంతాచారి వర్ధంతి సభ.. నివాళులర్పించిన నేతలు
ఓయూ, వెలుగు: తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిగా మరో పోరాటానికి విద్యార్థులు సిద్ధం కావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి ఇంకా నేరవేరలేదు. సామాజిక న్యాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కిండు. సామాజిక న్యాయం లేని రాష్ట్రం రాష్ట్రమే కాదు. రాష్ట్రంలో మళ్లీ అలజడి చెలరేగితే అందులో కేసీఆర్ కాలి బూడిద అవుతడు. తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేయొద్దు” అని అన్నారు. మలిదశ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా యువజన సమితి, విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో శనివారం ఓయూలోని ఐసీఏస్ఏస్ఆర్ హాల్లో ‘తెలంగాణ యూత్ డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఆర్ట్స్ కాలేజీ ముందు శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమను ఓయూ కోల్పోలేదని తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఆ ముసుగులో దోచుకుంటున్నారో అందరికీ తెలుసని అన్నారు.
మిగతావారికో రకం.. కవితకో రకమా?
ఢిల్లీ లిక్కర్ కేసులో మిగతా వారిని ఢిల్లీలో విచా రించి, కవితను మాత్రం అనుమతి కోరుతున్నారని, ఇదేం పద్ధతని రేవంత్ ప్రశ్నించారు. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే... కోకాపేట భూములు, బంగారు కూలీ, ఇతర కేసులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు కలిసి రావాలి: కోదండరాం
పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం తనను కలిచివేసిందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కో దండరాం అన్నారు. కేసీఆర్ ను ఓడించడానికి, ఉద్యోగాలు సాధించడానికి మళ్లీ ప్రగతిశీల పోరా టాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా పో రాటాలు కొనసాగించేందుకు పిలుపిచ్చామని.. విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి రావాలని కోరారు.
విద్య అందకుండా కేసీఆర్ కుట్ర: హరగోపాల్
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. పోరా టాల ద్వారానే ప్రభుత్వ విద్యను రక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలిపారు. పేదలకు విద్యను అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, అందుకే ప్రభుత్వ వర్సిటీల్లోని టీ చింగ్, నాన్ టీచింగ్పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు.