మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. 58 ఇంటర్ ప్రాక్టికల్ సెంటర్ల మార్పు

మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్..   58 ఇంటర్ ప్రాక్టికల్ సెంటర్ల మార్పు
  •     రేపటి పరీక్షలకు కొత్త సెంటర్లు
  •     దగ్గర్లోని కాలేజీల్లో ఆల్టర్నేట్  ఏర్పాట్లు
  •     షెడ్యూల్  కన్నా ముందే ముగుస్తున్న ప్రాక్టికల్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్  ఎన్నికల ఎఫెక్ట్  ఇంటర్  ప్రాక్టికల్స్ పై పడింది. పరీక్షా కేంద్రాలు ఉండి పోలింగ్  కేంద్రాలు ఉన్న సెంటర్లను మార్చాలని ఇంటర్  బోర్డు నిర్ణయించింది. బుధవారం జరగాల్సిన పరీక్షలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను మార్చింది. మార్పు చేసిన కేంద్రాల్లో అత్యధికం ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. 

ఎన్నికల పోలింగ్, ఇతర అవసరాల కోసం పలు కాలేజీ బిల్డింగులను అధికారులు వినియోగించుకుంటున్న నేపథ్యంలో, ఆయా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించి ఈ చర్యలు చేపట్టారు. అయితే ముందుగా పోస్ట్ పోన్ చేయాలని అధికారులు భావించినా.. అదే ప్రాంతంలో ఇంకొన్ని కాలేజీలు ఉండడంతో ఆ అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందే.. యథావిధిగా కొత్త సెంటర్లలో పనిచేస్తారని వెల్లడించారు. దీనికి సంబంధించి ముందే విద్యార్థులకు కూడా సమాచారం అందించామని పేర్కొన్నారు. 

రేపటితో ముగియనున్న ప్రాక్టికల్స్.. 

ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్  ప్రాక్టికల్స్ బుధవారంతో ముగియనున్నాయి. అయితే, ఇంటర్మీడియెట్  బోర్డు ముందుగా ప్రకటించిన షెడ్యూల్  ప్రకారం ఈ నెల 21వ తేదీ వరకు ప్రాక్టికల్స్  కొనసాగాల్సి ఉంది. కానీ, ఇంటర్  బోర్డు అధికారులు ముందస్తు చర్యలు, జిల్లాలతో సమన్వయం, ప్రాక్టికల్  సెంటర్ల పెంపుతో ముందుగానే పరీక్షలు ముగియనున్నాయి. ఈనెలాఖరు నుంచి ప్రారంభం కానున్న ఇంటర్  పబ్లిక్  పరీక్షలకు విద్యార్థులు సిద్ధం అయ్యేందుకు ఇది ఎంతగానే ఉపయోగపడనున్నాయి.