అది ఫ్రస్ట్రేషన్.. కాదు కన్ఫర్మేషన్! ఎస్సీ డిక్లరేషన్‌‌పై కేటీఆర్, రేవంత్ ట్వీట్ల వార్

అది ఫ్రస్ట్రేషన్.. కాదు కన్ఫర్మేషన్! ఎస్సీ డిక్లరేషన్‌‌పై కేటీఆర్, రేవంత్ ట్వీట్ల వార్
  • కాంగ్రెస్ 12 గ్యారెంటీలకువిలువ ఎక్కడిదన్న కేటీఆర్
  • పాలించే ఎబిలిటీ లేదు.. ప్రజల్లో క్రెడిబిలిటీ అంతకన్నా లేదని విమర్శ
  • దళితుడిని సీఎం చేస్తామని మోసం చేయడం తమ డిక్లరేషన్ కాదన్న రేవంత్

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్‌‌‌‌లో మాటల యుద్ధం సాగింది. కాంగ్రెస్ పార్టీది డిక్లరేషన్ సభలా లేదని, ఫ్రస్ట్రేషన్ సభలా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేయగా.. తమది దళితులు, గిరిజనుల జీవితాల్లో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్ సభ అని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. విజన్ లేని కాంగ్రెస్ డజన్ హామీలిచ్చినా గాలిలో దీపాలేనని‌‌ కేటీఆర్ విమర్శించగా.. దళితుడ్ని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాలు ఇస్తానని మోసం చేయడం లాంటిది తమ డిక్లరేషన్ కాదని రేవంత్ బదులిచ్చారు.

మీ డిక్లరేషన్‌‌ను నమ్మేదెవరు: కేటీఆర్

‘‘కాంగ్రెస్ పార్టీది డిక్లరేషన్ సభ కాదు. ‌‌అధికారం రాదనే‌‌ ఫ్రస్ట్రేషన్ సభ. కర్నాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్.. తెలంగాణకొచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు? గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు. మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది? ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట.. విజన్ లేని కాంగ్రెస్ డజన్ హామీలిచ్చినా గాలిలో దీపాలేనని‌‌ చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసు” అని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే.. దానికి కారణం, ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. దళిత, గిరిజన బిడ్డలకు‌‌ కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపం.. ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుందని అన్నారు. కర్నాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి‌‌ పాలించే ఎబిలిటీ లేదు.. ప్రజల్లో క్రెడిబిలిటీ లేదని విమర్శించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశానికే ఓ పరిపాలనా పాఠం. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ మీది. ఇవ్వని హామీలెన్నో అమలుచేసిన ప్రభుత్వం మాది. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదు.. కాంగ్రెస్‌‌కు భవిష్యత్తు లేదు. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ‌‌ బీఆర్ఎస్ మాత్రమే” అని కేటీఆర్​ పేర్కొన్నారు.

కేసీఆర్ ఖేల్ ఖతం: రేవంత్

తమ డిక్లరేషన్ దళిత, గిరిజన జీవితాల్లో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్ అని రేవంత్ అన్నారు. కేటీఆర్ ట్వీట్‌‌కు కౌంటర్‌‌‌‌గా ట్వీట్ చేశారు.  ‘‘మా డిక్లరేషన్.. దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు. గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని  మోసం చేయడం లాంటిది కాదు. మద్దతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదు. నేరెళ్ల ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదు. దళిత - గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదు. ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకుని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదు. ఏబీసీడీ వర్గీకరణ చేయకుండా మోసం చేయడం లాంటిది కాదు. దళితబంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదు. ఇప్పుడు యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే ‘కేసీఆర్ ఖేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్” అని విమర్శించారు.