పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత ఆయనను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టుకు ముందు రేవంత్ రెడ్డి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం దిగారు. వారి తీరుపై మండిపడ్డారు. తన ఇంటికి వచ్చి అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తాను తిరగొద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ధర్నా చౌక్ కు పోతున్నానని ఎవరు చెప్పారన్న రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని నిలదీశారు. ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేస్తే అరెస్ట్ చేయడం పోలీసుల డ్యూటీ గానీ.. ఇక్కడి నుండి అక్కడికి పోవడానికి ఎందుకు రిస్ట్రిక్షన్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశఆరు. తాను ఎటు వెళ్లినా పోలీసులకు చెప్పి వెళ్లాలా అని నిప్పులు చెరిగారు.
అంతకు ముందు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన విజయా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపైనా ఆయన పోలీసులు ఏకిపారేశారు. ఆమెను ఎక్కడ్నుంచైతే తీసుకెళ్లారో అక్కడికి తీసుకురండి అని డిమాండ్ చేశారు. సర్పంచులకు తెలియకుండా రూ.35వేల కోట్లు దారి మళ్లించారన్న రేవంత్ రెడ్డి... 8ఏళ్లు పూర్తయినా అమరవీరుల స్థూపం పూర్తి కాలేదని ఆరోపించారు. అసలు తనను ఏ కారణాలతో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.