సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

 సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఎల బతుకులు అగమ్యగోచరంగా మారాయని, వారి అకాల మరణాలు, ఆత్మహత్యలు నిత్యకృత్యం కావడం బాధాకరమని అన్నారు. వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. వారి సమస్యలు పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించి, ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేసీఆర్ ను  రేవంత్ కోరారు. 

వీఆర్‌ఏలకు పే స్కేల్‌ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా 2020, సెప్టెంబర్ 9న కేసీఆర్ హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు దాటిందని రేవంత్ రెడ్డి తెలిపారు. “ఇకపై వీఆర్వోలు ఉండరు. విద్యార్హతలు కలిగిన వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేస్తాం. ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పిస్తాం. 55 ఏళ్లు నిండితే వారి పిల్లలకు వారసత్వంగా వీఆర్‌ఏలుగా అవకాశం కల్పిస్తాం…” అంటూ ఆ సందర్భంగా  హామీలు గుప్పించారు. మీ హామీలను చూసి వీఆర్ఏలు  ఉబ్బితబ్బిబ్బయ్యారు. జీవితాలు మారిపోతాయని ఆశపడ్డారు. పే స్కేల్‌ అమలు చేస్తే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం వస్తుందని ఆశ పడ్డారు. పీఆర్సీ అమలు చేసినప్పుడల్లా జీతాలు పెరుగుతాయని భావించారు. ఇతర శాఖల్లోని ఉద్యోగుల తరహాలోనే పదోన్నతులు వస్తాయని ఆశించారు. మరీ ముఖ్యంగా ఉద్యోగానికి భద్రత ఉంటుందని భావించారు. కానీ మీరు యదావిధిగా మాటతప్పారు. ఉదారంగా హామీలు ఇవ్వడమే తప్ప, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి మీకు ఎప్పుడూ లేదు. వీఆర్ఎల విషయంలో సైతం అదే ధోరణిని ప్రదర్శించారు. మాట ఇచ్చిన తప్పిన మీరే వీఆర్‌ఏల చావులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా అని రేవంత్ ప్రశ్నించారు. ఇప్పటికైనా వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో వీఆర్ఎల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్ధతుగా నిలవడమే కాక... వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతావని రేవంత్ హెచ్చరించారు. 

డిమాండ్లు :


•    మీరు స్వయంగా హామీ ఇచ్చిన విధంగా వీఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయాలి.
•    అర్హులైన వీఆర్ఎలకు పదోన్నతులు కల్పించాలి.
•    సొంత గ్రామాల్లో వాళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలి.
•  సమ్మె కాలంలో, విధి నిర్వహణలో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఎల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.