
- కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో కేసీఆర్‌కు చలి జ్వరం
- రాష్ట్రంతోపాటు ఆయన బుర్ర కూడా దివాలా
- కాంగ్రెస్ హామీలు అమలు చేయొచ్చని రాజముద్ర వేసిండు
- ఇక శాశ్వతంగా రెస్ట్ తీసుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను సీఎం కేసీఆర్ కాపీ కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘మమ్మల్ని కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద గోతిలో పడ్డారు. మా ఆరు గ్యారంటీలను చూసి కేసీఆర్‌కు ఇన్నాళ్లూ చలిజ్వరం వచ్చింది. మా హామీలను అమలు చేయడం అసాధ్యమన్న బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు వాళ్ల హామీలను ఎట్ల సమర్థించుకుంటారు? కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హతను బీఆర్ఎస్ వాళ్లు కోల్పోయారు” అని అన్నారు.
ఆదివారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని, కేసీఆర్ ఆలోచన శక్తిని కోల్పోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దృష్టిలో బీఆర్ఎస్ మేనిఫెస్టో ఓ చిత్తు కాగితమని, దాని గురించి మాట్లాడడం కూడా దండగేనన్నారు. ‘‘మహాలక్ష్మి పథకం కింద మేం రూ.2,500 అంటే కేసీఆర్ రూ.3 వేలు ఇస్తామంటున్నారు. ఆడ బిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తమని మేమంటే.. రూ.400కే ఇస్తమంటూ కేసీఆర్ అన్నారు. పింఛన్లు మేం రూ.4 వేలు ఇస్తామంటే.. కేసీఆర్ రూ.5 వేలు అంటున్నారు. మేం ఇందిరమ్మ భరోసా కింద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు రూ.15 వేలు ఇస్తామంటే.. ఆయన ఇప్పుడు రూ.16 వేలు ఇస్తామంటున్నారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గతంలో సారా పాటలు నిర్వహిం చేవారు. కేసీఆర్ మాత్రం అట్లాంటి పాటలేవీ లేకుండానే కాంగ్రెస్‌ను కాపీ కొట్టారు. రాష్ట్రం దివాలా తీయడమే కాకుండా.. కేసీఆర్ బుర్ర కూడా దివాలా తీసింది’’ అని విమర్శించారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయలే
బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్‌లో చూపించినట్టు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని రేవంత్ విమర్శిం చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన పాత హామీలనే అమలు చేయలేదని, ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించా రు. ‘‘కేసీఆర్, బీఆర్ఎస్ ఏ మాత్రం స్వయంప్రకాశకులు కాదు. పరాన్న జీవులు, పక్కవాళ్ల మీద ఆధారపడి బతికే వాళ్లు. ప్రజా సంక్షేమంపై బీఆర్ఎస్‌కు ఆలోచన, చిత్తశుద్ధి లోపించాయని చె ప్పేందుకు మేనిఫెస్టోనే నిదర్శనం. కాంగ్రెస్ రెండేండ్ల నుంచి ఇచ్చిన హామీలన్నింటినీ బీఆర్ఎస్ కాగితంపై రాసుకుని ఇవాళ మేనిఫెస్టోలా విడుదల చేసింది. కేసీఆర్‌లా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. అమలు చేయగలమన్న నమ్మకంతోనే ఆరు గ్యారంటీలను ప్రకటించాం. కాంగ్రెస్ గ్యారంటీలను కాపీ కొట్టడంతో, వాటి అమలు సాధ్యమని కేసీఆరే రాజముద్ర వేసి మరీ అంగీకరించినట్టయింది’’ అని అన్నారు.
బీఫామ్స్ మిగతా వాళ్లకు ఎందుకియ్యలే
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. తాము అభ్యర్థులను ప్రకటించగానే.. కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారన్నారు. అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీనే ముందుందని చెప్పారు. ‘‘మేం 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. బీఆర్ఎస్ ప్రకటించిన వాళ్లలో 51 మందికే బీఫామ్స్ ఇచ్చారు. మిగతా వాళ్లకు బీఫామ్స్ ఎందుకివ్వలేదు?” అని ప్రశ్నించారు. అర్థంపర్థం లేని ఆరోపణలతో కాంగ్రెస్‌పై బిల్లా, రంగాలు బురదజల్లుతున్నారని కేటీఆర్, హరీశ్‌పై మండిపడ్డారు. ఎక్కడో డబ్బులు దొరికితే తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. దోపిడీ సొమ్ముతో కేసీఆరే దేశ రాజకీయాలు చేయాలనుకున్నారని, అందులో ఘోరంగా ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. దీనిపై ఈ నెల 17న (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు తాను అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని, కేసీఆర్ కూడా అక్కడకు వస్తే ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు.
ఏ ఆధారాలతో ప్రవల్లిక వివరాలను బయటపెట్టారు: రేవంత్
ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతి ప్రవల్లిక వివరాలను పోలీసు అధికారి ఏ ఆధారాలతో బయటపెట్టారని రేవంత్ ప్రశ్నించారు. ఫోరెన్సిక్ నివేదిక రాకుండా ఫోన్ చాట్ ఉందని ఎలా చెప్తారని నిలదీశారు. వ్యక్తిగత వివరాలను బయటపెట్టి నిర్భయ చట్టాన్ని ఆ అధికారి ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన యువతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారి కుటుంబం పరువుకు నష్టం కలిగించడం కాదా? అని ప్రశ్నించారు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన ఆ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనకు ఎక్స్‌పైరీ వచ్చేసింది
రాష్ట్రం నిజంగా దివాలా తీయకుంటే ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు ఎందుకివ్వడం లేదని కేసీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీయకుంటే ఉద్యోగులు, పింఛనుదారులకు ఒకటో తేదీనే అకౌంట్లలో డబ్బులు వేయాలని సవాల్ విసిరారు. అవినీతికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆరోపించారు. కేసీఆర్‌కు శాశ్వత విశ్రాంతి అవసరమన్నారు. కేసీఆర్ పాలనకు ఎక్స్‌పైరీ డేట్ వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద శాతం అధికారంలోకి వచ్చి తీరుతుందని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు.