- భూ రికార్డుల సర్వేను తప్పుగా అర్థం చేసుకోవద్దని సూచన
- భూ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దళితులు, గిరిజనుల భూములకు ఎలాంటి ఢోకాలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. వారికి సంబంధించిన అంగుళం భూమిని కూడా తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దళితుల భూములకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ రక్షణగా కల్పిస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.
సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. భూ సంస్కరణలు, భూ పంపిణీ వల్ల భూమిలేని దళితులకు భూములు ఇచ్చి, వాటిపై హక్కులు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో దళితులకు సుమారు 25 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశామని చెప్పారు. పోడు భూముల విషయంలో గిరిజనులకు సుమారు 2 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనన్నారు.
రికార్డుల పరిశీలన.. భూములు లాక్కోవడానికి కాదు..
భూములకు సంబంధించిన రికార్డుల పరిశీలన, సర్వేలు, భూ సమస్యల పరిష్కార ప్రక్రియలను భూములు లాక్కోవడానికి చేస్తున్న చర్యలుగా చూడటం సరికాదని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రజల భూ హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, వివాదాలను పరిష్కరించడం, హక్కులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.
రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులు, గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల ప్రాంతంలోని 15 రెవెన్యూ గ్రామాలతో పాటు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపించినట్లు చెప్పారు
రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలి..
దళితుల భూముల విషయంలో కొందరు కావాలనే భయాందోళనలు సృష్టిస్తూ విషప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దళితులను రెచ్చగొట్టి వారి భూముల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే ప్రయత్నాలను అర్థం చేసుకోవాలని అన్నారు.
అధికారంలోకి వస్తే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చి, ఆ తర్వాత విస్మరించారని పొంగులేటి విమర్శించారు. అలాంటి హామీలను ప్రజలు నమ్మొద్దని కోరారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు.
