హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ప్రమోషన్లను సమీక్షించాలని తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ నేతలు విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థల్లో కల్పించిన ప్రమోషన్లను హైకోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించాలని తెలిపారు. తద్వారా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. దీనిపై సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సానుకూలంగా స్పందించారు.

