ఓటమి భయంతోనే సోనియా, రాహుల్ కు ఈడీ నోటీసులు

ఓటమి భయంతోనే సోనియా, రాహుల్ కు ఈడీ నోటీసులు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే భయం తోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ ద్వారా ప్రధాని మోడీ నోటీసులు పంపారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల 23న సోనియా గాంధీ ఈడీ ఆఫీసులో అడుగుపెడితే మోడీ పునాదులు కదులుతాయని, ఆ రోజు నుంచి ఆయన పతనం స్టార్ట్ అవుతుందని హెచ్చరించారు. ఈ దాడి గాంధీ ఫ్యామిలీ మీద జరిగిందికాదని, దేశ గౌరవం, ప్రతిష్ట మీద జరిగిందన్నారు. గాంధీ కుటుంబం మీద ఈగ వాలినా రాజకీయంగా బతికి బట్టకట్టలేరని చెప్పారు. తెలంగాణ తల్లి సోనియాను ఈడీ ఆఫీస్‌‌కు పిలుస్తే ఊరుకుంటామా అని అన్నారు. గాంధీ వారసులం కాబట్టి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ ఐమాక్స్ సర్కిల్‌‌ నుంచి బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ కార్యాలయం దాకా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ  ర్యాలీ చేపట్టారు. ఈడీ ఆఫీస్ ముందు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, నేతలు పొన్నం ప్రభాకర్, మహేశ్‌‌ కుమార్ గౌడ్ తదితరులు బైఠాయించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష పార్టీల నేతలను భయపెట్టి జైలుకు పంపాలని బీజేపీ ప్రయత్నిస్తోందని 
ఆరోపించారు.