రాష్ట్రంలోని రైస్‌‌‌‌ మిల్లులు నడవక 12వ రోజు

రాష్ట్రంలోని రైస్‌‌‌‌ మిల్లులు నడవక 12వ రోజు
  • ఎక్కడి ధాన్యం అక్కడే
  • మిల్లుల వద్ద వందలాది ధాన్యం లారీలు
  • ఇగ చూస్తూ ఊరుకోమన్న మిల్లర్లు
  • ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వార్నింగ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలోని రైస్‌‌‌‌ మిల్స్​ నడవక 12 రోజులవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం.. రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,470 రా రైస్ మిల్స్, 970 బాయిల్డ్ రైస్ మిల్స్​లో మిల్లింగ్‌‌‌‌ నిలిచిపోయింది. దీంతో మిల్లుల వద్ద ధాన్యం గుట్టలుగా పేరుకుపోయింది. నిజామాబాద్‌‌‌‌ జిల్లా బోధన్​లోనే దాదాపు150 లారీల వడ్ల లోడ్లు మిల్లుల వద్ద నిలిచిపోయాయి. మిల్లింగ్‌‌‌‌ వ్యవహారం తేలకపోవడంతో ధాన్యం బస్తాలన్నీ రోడ్లపై, మిల్లుల ఎదుట కనిపిస్తున్నాయి.

ఎండకు ఎండి.. వానకు తడుస్తున్నాయి. కస్టమ్‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌ రైస్‌‌‌‌ వివాదం చిలికిచిలికి గాలి వానగా మారింది. ఫిజికల్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌, రేషన్‌‌‌‌ బియ్యం పంపిణీ  వివాదం కేంద్ర, రాష్ట్ర సర్కారుల మధ్య ఆగాధాన్ని మరింత పెంచుతూ వస్తోంది. జూన్‌‌‌‌ 7 నుంచి ఎఫ్‌‌‌‌సీఐ బియ్యం సేకరణ నిలిపివేసింది. దీంతో 12రోజులుగా ధాన్యం సేకరణ కూడా ఆగిపోయింది. ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. మరోవైపు ధాన్యం కొనుగోలు సెంటర్ల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించారు. చాలా మిల్లుల వద్ద ధాన్యాన్ని టార్పాలిన్​ కవర్లు కప్పి నిల్వ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా ధాన్యం బస్తాల లోడుతో నిలిచిపోయిన లారీలు కనిపిస్తున్నాయి. లక్షలాది టన్నుల ధాన్యం ఇంకా మిల్లులకు చేరలేదు. ఫలితంగా రైతులకు ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.  

60లక్షల టన్నుల బియ్యం తీసుకోవాలె..

ఎఫ్‌‌‌‌సీఐ అప్పగించాల్సిన బియ్యం ఇంకా చేరలేదు. 2వారాలుగా మిల్లింగ్‌‌‌‌ నిలిచిపోవడంతో నిరుడు యాసంగి బియ్యం 3.70లక్షల టన్నులు ఇంకా అందలేదు. దీనికి ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. వీటికి తోడు ఈయేడు వానాకాలం బియ్యం 25 లక్షల టన్నులు, యాసంగి బియ్యం 33.50 లక్షల టన్నులు.. అన్నీ కలిపి 62.20 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్ సీఐ ఇంకా ఇవ్వాల్సి ఉంది. మిల్లులన్నీ నడువక పోవడంతో ఎక్కడ వేసిన బస్తాలు అక్కడే ఉన్నాయి. 

కారణం​ ఏమిటంటే..

ఫిజికల్​ వెరిఫికేషన్‌‌‌‌లో.. మిల్లర్ల లెక్కల ప్రకారం నిర్వహించడం లేదనీ, మిల్లింగ్‌‌‌‌ టైంకు ఇవ్వకుండా మిల్లర్లు జాప్యం చేస్తున్నారని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లను గుర్తించి ఫిర్యాదు చేసినా.. రాష్ట్ర సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎఫ్‌‌‌‌సీఐ వర్గాలంటున్నాయి. దీనికి తోడు రేషన్‌‌‌‌ బియ్యం లిఫ్ట్‌‌‌‌ చేసి వినియోగదారులకు ఇవ్వక పోవడంపైనా ఎఫ్‌‌‌‌సీఐ సీరియస్‌‌‌‌ అయింది. దీంతో ఎఫ్‌‌‌‌సీఐ బియ్యం సేకరణ నిలిపివేసింది. ఈ వ్యవహారం ఇప్పటివరకు ఎటూ తేలకపోవడంతో పరిస్థితి యథాతథంగా కొనసాగుతోంది.

సర్కారుల మధ్య కొట్లాటతో మేం బలయితున్నం

కేంద్ర, రాష్ట్ర సర్కారుల పట్టింపుల మధ్య మిల్లింగ్‌‌‌‌ ఇండస్ట్రీ నలిగిపోతోంది. ఎఫ్‌‌‌‌సీఐ బియ్యం సేకరించడం లేదు. అందుకే మిల్లింగ్‌‌‌‌ నిలిపివేశాం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం తరలింపు ఎక్కడికక్కడ ఆగిపోయింది. నిల్వ చేసుకునేందుకు సౌలత్​లు లేకపోవడంతో వడ్లు వానకు తడిచి ఎండకు ఎండుతున్నయ్‌‌‌‌. ముక్కిపోతున్నాయ్‌‌‌‌.. స్టేట్​ గవర్నమెంట్​ ఏమైనా చేస్తదేమో అని చూస్తున్నం. ఇప్పటి వరకు ఓపిక పట్టినం.. ఇగ లాభం లేదు.. మేము పంజా విసురుతాం.. మూడు, నాలుగు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. - మోహన్‌‌‌‌రెడ్డి, మిల్లర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ జనరల్‌‌‌‌ సెక్రటరీ