న్యూఢిల్లీ: లోక్ సభలో మహిళా కోటా బిల్లు వీగిపోవడంపై అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం సాగింది. మహిళా కోటా బిల్లును అడ్డుకున్నందుకు ప్రతిపక్ష కాంగ్రెస్పై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. శనివారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో మీడియాతో మాట్లాడారు. మహిళల కోసం లోక్ సభలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం సరికాదన్నారు.
మహిళా బిల్లు లోక్ సభలో ఆమోదం పొందకపోవడంపై తమ ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నదని చెప్పారు. కానీ దానిని ఫెయిల్యూర్ గా భావించడం లేదని పేర్కొన్నారు. మహిళల హక్కులను వారికి దక్కకుండా చేసి కాంగ్రెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ కు మహిళలు కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు. ‘‘మహిళా బిల్లును అడ్డుకొని ఏదో విజయం సాధించినట్లు కాంగ్రెస్ సెలబ్రేట్ చేసుకుంటోంది. మహిళల హక్కులను కాలరాస్తే, విజయం సాధించినట్లా? కాంగ్రెస్ మరోసారి తన మహిళా వ్యతిరేక మెంటాలిటీని బయటపెట్టుకుంది. ఇది ఆ పార్టీకి మాయని మచ్చ. ఇది బ్లాక్ డే. బిల్లు పాస్ చేయించేందుకు మా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా.. కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఇది మా ప్రభుత్వ వైఫల్యం కాదు. ప్రతిపక్ష ఎంపీలతో బిల్లుకు అనుకూలంగా బలవంతంగా ఓటు వేయించలేం కదా!” అని రిజిజు వ్యాఖ్యానించారు.

