మెగా టోర్నీలకు దూరం...ప్రమాదంలో పంత్ కెరీర్

మెగా టోర్నీలకు దూరం...ప్రమాదంలో పంత్ కెరీర్

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కెరీర్ ప్రమాదంలో పడిందా..? అతను  తిరిగి భారత జట్టులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందా..? కీలకమైన టోర్నీలకు దూరమవనున్న పంత్ ను..బీసీసీఐ పూర్తిగా పక్కకు పెట్టనుందా ..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. 

కెరీర్పై ప్రభావం..

కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్..తన క్రికెట్ కెరీర్ను తనే ప్రమాదంలో పడేసుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్ టెస్టు సిరీస్లో మోస్తారుగా రాణించిన పంత్ను బీసీసీఐ శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లకు ఎంపిక చేయలేదు. అయితే లంక సిరీస్కు పంత్ను పక్కకు పెట్టినా..అతనిపై బీసీసీఐకు విపరీతమైన అంచనాలున్నాయి. కానీ తాజా ప్రమాదం..అతని కెరీర్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

కీలక టోర్నీలకు దూరం..?

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్..ఇప్పట్లో క్రికెట్ ఆడటం కష్టమే. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని..తిరిగి ఫిట్నెస్ సాధించి..తనను తాను నిరూపించుకుని  రీ ఎంట్రీ ఇవ్వడానికి ఏడాదికి పైనే పడుతుంది. అదే జరిగితే వచ్చే ఐపీఎల్తో పాటు... వన్డే వరల్డ్ కప్ కూడా దూరమవుతాడు. దీనికి తోడు కీలకమైన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్కు దూరమయ్యే అవకాశాలున్నాయి. 

ఫ్యాన్స్ ప్రార్థన..

ధోని తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాడు రిషబ్ పంత్. టెస్టు, వన్డే, టీ20ల్లోనూ దూకుడైన ఆటతీరుతో అలరిస్తాడు. దీంతో వన్డే వరల్డ్ కప్లో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే  మెగా టోర్నీలోపు  పంత్ తిరిగి కోలుకుని జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.