IND vs ENG 2025: టీమిండియా సిక్సర్ల వీరుడు.. 27 ఏళ్లకే అగ్రస్థానానికి పంత్

IND vs ENG 2025: టీమిండియా సిక్సర్ల వీరుడు.. 27 ఏళ్లకే అగ్రస్థానానికి పంత్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సిక్సర్లలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక బాదిన ఆటగాళ్ల లిస్ట్ లో మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తో కలిసి పంత్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. సెహ్వాగ్, పంత్ ఇద్దరూ కూడా 90 సిక్సర్లతో టాప్ లో ఉన్నారు. అయితే సెహ్వాగ్ కంటే పంత్ తక్కువ మ్యాచ్ ల్లో ఈ ఘనత సాధించడంతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ టీమిండియా ఈ ఘనత అందుకున్నాడు. 

రెండో రోజు ఆటలో భాగంగా ఆర్చర్ వేసిన షార్ట్ బాల్ ను మిడ్ వికెట్ దిశగా సిక్సర్ కొట్టడంతో టెస్టుల్లో తన సిక్సర్ల సంఖ్య 90 కి చేరింది. ఇదే మ్యాచ్ లో అంతకముందు సిక్సర్ కొట్టిన ఈ టీమిండియా వికెట్ కీపర్ టెస్టుల్లో రోహిత్ (88) సిక్సర్ల రికార్డ్ ను అధిగమించాడు. 47 టెస్టుల్లో 82 ఇన్నింగ్స్ ల్లోనే పంత్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం. పంత్ మరో సిక్సర్ కొడితే భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అధికారికంగా తన పేరును లిఖించుకుంటాడు. ఇంగ్లాండ్ తో మరో టెస్ట్ ఉండడంతో ఈ సిరీస్ లోనే పంత్ ఈ ఘనత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ మ్యాచ్ లో గాయంతో కూడా పంత్ బరిలోకి దిగి హాఫ్ సెంచరీ చేయడం విశేషం. తొలి రోజు కుడి కాలి వేలికి తీవ్ర గాయం కావడంతో ఆరు వారాల రెస్ట్  అవసరమని డాక్టర్లు సూచించగా..పంత్ జట్టు కోసం పెయిన్ కిల్లర్స్ తో బరిలోకి దిగిన విధానం ఆకట్టుకుంటుంది. తొలి ఇన్నింగ్స్ లో పంత్ 54 పరుగులు చేసి రాణించాడు. పంత్ ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ టీమిండియా 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 166 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.