మేడిపల్లి, వెలుగు: తాళం వేసిన ఇళ్లనే కాకుండా ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒంటరిగా నివసిస్తున్న ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి, కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ స్వరూప్నగర్ కాలనీలో నల్లవెల్లి సుశీలరెడ్డి (70) ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఓ దొంగ కిటికీ గ్రిల్ ఊడదీసి ఇంట్లోకి చొరబడ్డాడు.
నిద్రలో ఉన్న ఆమెను అరిస్తే చంపేస్తానని కత్తితో బెదిరించడంతో తన ఒంటిపై ఉన్న బంగారు గాజులు, పుస్తెలతాడు, ఉంగరాలు, కమ్మలను ఇచ్చేసింది. అనంతరం దొంగ బయట నుంచి తలుపు గడియ పెట్టి పరారు కావడంతో వృద్ధురాలు బయటకు రాలేక ఇబ్బందులు పడింది. ఆ తర్వాత ఆమె తన కూతురికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.
