ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ చోరీ

ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ చోరీ

ఆదివారం రాత్రి బెంగళూరులోని లింగరాజపురంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ దొంగతనం జరిగింది. ఈ దోపిడిలో రూ .16 కోట్ల విలువైన 70 కిలోల బంగారం దొంగతనం జరిగింది. లింగరాజపురంలోని ఎస్సార్ కాంప్లెక్స్ యొక్క మొదటి అంతస్తులో ముత్తూట్ కార్యాలయం ఉంది. సోమవారం ఉదయం అవుట్‌ లెట్ సిబ్బంది కార్యాలయాన్ని తెరిచినప్పుడు బంగారం నిల్వచేసే గది ఖాళీగా ఉన్నట్లు గుర్తించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రాంచ్ మేనేజర్ సంగీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంతస్థులో బ్యూటీ పార్లర్ మరియు బేకరీ కూడా ఉన్నాయి. కాగా.. మూడు మరియు నాల్గవ అంతస్తులలో పురుషల హాస్టల్ ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు భవనం యొక్క మొదటి అంతస్తులోని వాష్‌రూమ్ ద్వారా ముత్తూట్ కార్యాలయానికి రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారని తెలుస్తోంది. ఆఫీస్ లోపల స్ట్రాంగ్ రూం తలుపును పగలగొట్టడానికి గ్యాస్ కట్టర్‌లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. దొంగలు ముత్తూట్ ఆఫీస్‌లోకి ప్రవేశించే ముందు విద్యుత్ సరఫరాను నిలిపివేసి.. సీసీటీవీ కెమెరాలు మరియు సెక్యూరిటీ అలారాలను పనిచేయకుండా చేశారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ దొంగతనంలో ముత్తూట్ కార్యాలయ సిబ్బంది హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆఫీస్ వద్ద తగినంత భద్రతా సిబ్బంది లేనందువల్లే ఈ దొంగతనం జరిగిందని వారు భావిస్తున్నారు. ఈ సంస్థ ఒక్క సెక్యూరిటీ గార్డును మాత్రమే ఆఫీస్ వద్ద నియమించింది. అతను కూడా దొంగతనం జరిగిన సమయంలో సెలవులో ఉన్నాడు.

క్రిస్మస్ సీజన్ కావడంతో రోడ్లన్నీ చాలా రద్దీగా ఉండటంతో పాటు గొడవగొడవగా ఉన్నాయి. దాంతో దొంగలకు స్ట్రాంగ్ రూం పగలగొట్టడం చాలా సులభమయింది. నిందితులను పట్టుకోవడం కోసం పోలీసులు సమీపంలో ఉన్న సీసీటీవీల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దాని ద్వారా దొంగలు ఏ వాహనంలో వచ్చివెళ్లారో తెలుసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు ముత్తూట్ ఆఫీస్ పైన ఉన్న హాస్టళ్లోని ఒక గదిలో రెండు ఎల్‌పీజీ సిలిండర్లు మరియు పలు ఆభరణాల ఖాళీ పెట్టెలను పోలీసులు కనుగొన్నారు. దాంతో ఈ దొంగతనం వెనక హాస్టల్‌లో ఉండే వారెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ గదిలో ఉన్న వారి నుంచి హాస్టల్ యజమాని ఎటువంటి గుర్తింపు పత్రాలను తీసుకోకపోవడంతో అతనిని కూడా విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.

For More News..

జూలో బాలుడిపై దూకిన పులి.. వీడియో వైరల్