- పగిడిపల్లి మినీ జంక్షన్ వద్ద రైల్ ట్రాఫిక్
- గంటల కొద్దీ రైళ్ల నిలిపివేత
- సమస్య అధిగమించడానికి
- బీబీనగర్ టు బొమ్మాయిపల్లి వరకు రైల్ ఓవర్ రైల్
- రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఎకరాకు రూ. 17.06 లక్షల నుంచి రూ. 29.40 లక్షలు
- నిర్వాసితులకు మూడు రెట్లు పరిహారం
యాదాద్రి, వెలుగు : రైళ్ల ట్రాఫిక్సమస్య అధిగమించడానికి ఆ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా బీబీనగర్-బొమ్మాయిపల్లి మధ్య రైల్ ఓవర్ రైల్(ఆర్వోఆర్) నిర్మాణానికి ప్రాసెస్మొదలైంది. భూ సేకరణ కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్రిలీజ్చేశారు.
పగిడిపల్లి వద్ద రెండు రైలు మార్గాలు..
యాదాద్రి జిల్లా మీదుగా గుంటూరు టు సికింద్రాబాద్, సికింద్రాబాద్టు కాజీపేట రైలు మార్గాలు ఉండగా, నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఈ మార్గాలు ఎప్పుడూ రైళ్ల ట్రాఫిక్‌తో బిజీగా ఉంటాయి. అయితే ఈ రెండు మార్గాలు బీబీనగర్ మండలం పగిడిపల్లి మినీ జంక్షన్ వద్ద కలుస్తాయి. ఈ మార్గాల్లో నడిచే రైళ్లు ఒకే సమయంలో చేరుకునే సందర్భాలు అనేకం. దీంతో ఒక మార్గంలో వచ్చే రైలును ఆపి, మరో మార్గంలో వచ్చే రైలును పంపిస్తూ ఉంటారు. దీనివల్ల రైళ్లలో ప్రయాణించే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సమస్య అధిగమించడానికి ఆర్వో ఆర్
రైలు, రోడ్డు మార్గాలు కలిసే రూట్లలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) లేదా అండర్ పాస్ నిర్మించి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు రైలు మార్గాలు కలుస్తున్న ప్లేస్‌లో రైళ్ల ట్రాఫిక్ అధిగమించడానికి రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్) నిర్మిస్తున్నారు. రైలు మార్గాలు కలుస్తున్న చోట ఒక రూట్ మీదుగా బ్రిడ్జి నిర్మించి దాని మీదుగా రైళ్లు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ తరహాలోనే సికింద్రాబాద్టు కాజీపేట (బీబీనగర్ మండలం గూడూరు) మార్గం మీదుగా సికింద్రాబాద్ టు గుంటూరు నడికుడి రూట్(భువనగిరి మండలం బొమ్మాయిపల్లి) వరకూ రైల్ ఓవర్ రైల్ బిడ్జి నిర్మాణం కోసం ప్రణాళిక రూపొందించారు. ఈ తరహాలో విజయవాడ సెక్షన్ పరిధిలోని గూడూరు, మునుబోలు మధ్య ఆర్వోఆర్ నిర్మించారు.
భూ సేకరణకు ప్రిలిమినరీ నోటిఫికేషన్
బీబీనగర్ నుంచి బొమ్మాయిపల్లి వరకు దాదాపు 8 కిలోమీటర్లు నిర్మించే ఆర్వోఆర్ కు కావాల్సిన భూమి కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్చేశారు. బీబీనగర్, పగిడిపల్లి గ్రామాల్లోని 40 సర్వే నెంబర్లలోని 25.18 ఎకరాలు అవసరం పడుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
పరిహారం మూడు రెట్లు..
భూ సేకరణ చట్టం 2013 ప్రకారం సేకరించే భూమికి ప్రభుత్వం మూడు రెట్ల పరిహారం అందించనుంది. ఆర్వోఆర్ కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్ ప్రకారం 25.18 ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. ఇందులో బీబీనగర్‌లో 3.07 ఎకరాలు, పగిడిపల్లిలో 4.81 ఎకరాలు, గూడూరులో 17.70 ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ గ్రామాల్లో ఎకరానికి రూ. 17.06 లక్షల నుంచి 29.40 లక్షల వరకూ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఉంది.
అయితే ఇంకా సర్వే చేయకపోవడంతో సేకరించే భూమిలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశ ముంది. కాగా, ఆర్వోఆర్ కోసం జరిగే భూ సేకరణలో తనకు అన్యాయం జరుగుతోందని బాధిత రైతు బాల్‌రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఆర్వోఆర్ కారణంగా తన భూమి మూడు భాగాలుగా విడిపోతోందని సదరు రైతు తన పిటీషన్లో పేర్కొన్నారు. రెండు ట్రాక్‌ల మధ్య మిగిలే ఆ భూమి తనకు ఎందుకు పనికిరాదని పేర్కొన్నారు.
