ట్యాంక్‌బండ్, వెలుగు: మాలల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న ప్రస్తుత రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. దాసరి విశాల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో మాలలకు అన్యాయం చేస్తున్న రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు సుధా మల్ల అంజలి కుమారి, మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ మాంచాల లింగస్వామి, ది నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నే శ్రీధర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల గ్రూప్–3లోని మాల, మాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
దీంతో పలు ఉద్యోగ నోటిఫికేషన్లలో ఈ వర్గాలకు తగిన అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రోస్టర్ విధానాన్ని సవరించి గ్రూప్–3లో తొలి రోస్టర్ పాయింట్‌ను 22 నుంచి 16కు మార్చాలని, అలాగే తొలి 50 రోస్టర్ పాయింట్లలో మాలలకు మూడు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే మాలలను ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుణ్య భానుప్రకాశ్, నామ్‌దేవ్, రాజేశ్, భుజంగరావు, సత్యనారాయణ, సుగుణ, సౌభాగ్య, చంద్రకళ తదితరులు
పాల్గొన్నారు.
