- రెండో భార్య తమ్ముడి బర్త్ డే కు వచ్చిన రౌడీ షీటర్ సూరి
- మొదటి భార్య, బావమరిది హత్య కేసులో సూరి నిందితుడు
- ఇప్పటికే సూరిపై నగర బహిష్కరణ విధించిన పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: భార్య, బావమరిదిని గతంలో హత్య చేసిన సూరి అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన కళ్లల్లో కారం పొడి చల్లి, కత్తులతో పొడిచి అప్రోజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మీర్‌పేట పోలీసులు తెలిపిన ప్రకారం.. రౌడీషీటర్ సూరి మీర్ పేటలోని నందనవనంలో ఉండేవాడు.
హైదరాబాద్, మల్కాజిగిరి, వరంగల్ కమిషనరేట్లలో క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతడు మొదటి భార్య, ఆమె తమ్ముడిని కూడా హత్య చేశాడు. పోలీసులు సూరిని నగర బహిష్కరణ చేశారు. తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల కోసం సూరి రహస్యంగా నగరానికి వచ్చాడు. అయితే మొదటి భార్యను, ఆమె తమ్ముడు సల్మాన్ ను హత్య చేసిన సూరిపై సల్మాన్ సోదరుడు అప్రోజ్ పగ పెంచుకున్నాడు.
మీర్ పేటలోని నందనవనానికి వచ్చిన సూరి మంగళవారం అక్కడే ఉన్న టీకేఆర్ కాలేజీ వద్దకు వచ్చినట్లు అప్రోజ్ కు తెలిసింది. వెంటనే అక్కడకు వెళ్లిన అఫ్రోజ్ సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి, కారం పొడి చల్లి కత్తులతో పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సూరిని స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ హత్యకు అప్రోజ్ స్నేహితులు సహకరించినట్లు తెలుస్తోంది.
చంపాక ఇన్‌స్టాగ్రాంలో వీడియో కాల్..
సూరిని హత్య చేసిన అనంతరం అప్రోజ్ ఇన్ స్టాగ్రాంలో తన ఫ్రెండ్స్ఈశ్వర్తో వీడియో కాల్లో మాట్లాడాడు. ‘వాడ్ని చంపేశాను’ అంటూ సంతోషంగా చెప్పాడు. ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, మీర్ పేట ఇన్‌స్పెక్టర్ బండారి శోభన్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. నిందితుడు అప్రోజ్ పరారీలో ఉన్నాడు. నగర బహిష్కరణ ఉన్న రౌడీషీటర్ సూరి సిటీకి ఎలా వచ్చాడనేది ప్రశ్నార్థకంగా మారింది.
