ప్రభుదేవా స్టెప్పులా మజాకా..! 100 మిలియన్లతో రౌడీ

ప్రభుదేవా స్టెప్పులా మజాకా..! 100 మిలియన్లతో రౌడీ

ఆ బీట్.. ఆ సాంగ్… ఆ స్టెప్పూ… ఆ జోష్.. అబ్బబ్బబ్బో… దుమ్ములేపడం అంటే అదీ. మారి-2 సినిమాలోని రౌడీ బేబీ పాటకు… ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ రికార్డులు బద్దలవుతున్నాయి. విడుదలకు ముందే లిరికల్ సాంగ్ సంచలనం సృష్టించింది. మూవీ రిలీజైనా… ఆశించినంత బిగ్ హిట్ కాకపోయినా… పాట మాత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రతి ఒక్కరి చెవులను మోతెక్కిస్తోంది. విడుదలైన 16 రోజులకే యూట్యూబ్ లో సౌతిండియా పాటల వ్యూస్ రికార్డ్ ను బద్దలు కొట్టింది. వంద మిలియన్ల(పదికోట్ల వ్యూస్) మార్క్ ను క్రాస్ చేసింది. లైక్స్ లో 1 మిలియన్ మార్క్ ను దాటేసింది.  అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కలిపి ఈ పాట 500 మిలియన్ల వ్యూస్ కు చేరువైంది.

రౌడీ బేబీ సాంగ్… ఇంతకుముందు యూట్యూబ్ లో రంగస్థలం సినిమాలోని ‘రంగమ్మ మంగమ్మ’ , ఫిదాలోని ‘వచ్చిందే’ సాంగ్స్ రికార్డులను కొల్లగొట్టింది. అతి తక్కువ రోజుల్లో వంద మిలియన్ వ్యూస్ దక్కించుకున్న సౌతిండియన్ పాట ఇదే.

డిసెంబర్ 23న మారి-2 సినిమా విడుదలైంది. జనవరి 2న రౌడీబేబీ వీడియో సాంగ్ రిలీజైంది. అప్పటికే ఆడియో సూపర్ హిట్ కావడంతో… ఈ వీడియోకు బుల్లెట్ స్పీడ్ తో వ్యూస్ వచ్చాయి. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం… ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా అందించిన కొరియోగ్రఫీ… ధనుష్ తో పాటు.. మరో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ కూతురు ధీ ఈ పాటను కిర్రెక్కించేలా పాడటం… పాటలో ధనుష్, సాయిపల్లవి ఊపునిచ్చే స్టెప్పులు.. ఎక్స్ ప్రెషన్స్… కెమిస్ట్రీ… అన్నీ అద్దిరిపోయేలా కుదిరాయి. ఈ పాటను రాసింది కూడా ధనుషే.

ప్రభుదేవా కొరియోగ్రఫీ ఈ సాంగ్ కే హైలైట్. షూస్ తో మూన్ వాక్.. కళ్లు చెదిరే స్టెప్పులు… ఊపునిచ్చే పాటకు మ్యాజికల్ మూవ్స్.. బీట్ – స్టెప్పులకు మధ్య అద్భుతమైన సింక్రొనైజేషన్… ఇవన్నీ బాగా కుదిరాయి. సెకండ్ కూడా కళ్లు తిప్పుకోనీయనంత బాగా ఈ పాటను షూట్ చేయడంతో.. ఆన్ లైన్ సెన్సేషన్ గా మారింది రౌడీ బేబీ.