మాదాపూర్, వెలుగు : హైటెక్ సిటీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. కత్తిపోట్లకు అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన ఖాజా హుస్సేన్ కుమారుడు నదీమ్ హుస్సేన్(30) ఫ్లోరిస్ట్ డెకరేషన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. 2019లో జరిగిన ఓ మర్డర్ కేసులో బోరబండ పోలీస్ స్టేషన్లో నదీమ్‌పై రౌడీ షీటర్ నమోదైంది. దీంతోపాటు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్పరిధిలోని ఓ మర్డర్ కేసులో అతను ఏ3గా ఉన్నాడు.
సోమవారం ఉదయం 7 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూకట్‌పల్లిలో భాగ్యనగర్ సొసైటీ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం అందడంతో మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైంది పాత నేరస్థుడు నదీమ్ హుస్సేన్‌గా గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు నదీమ్‌తో కలిసి నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించి అనంతరం అతడిని కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని మాదాపూర్ ఇన్ స్పెక్టర్ తిరుపతి వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.