
- సీజీఎఫ్ నిధులు రూ.779.74 కోట్లతో 1,979 గుడుల్లో పనులు
- ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన ప్రభుత్వం
- భక్తుల రద్దీకి అనుగుణంగా వసతుల కల్పనపై ఎండోమెంట్ ఫోకస్
- నాలుగు విడతల్లో అభివృద్ధి పనులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను ఆధ్యాత్మిక హంగులతో తీర్చిదిద్దునున్నారు. దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఉన్న ముఖ్యమైన గుడుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అలంపూర్ నుంచి బాసర వరకు భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని పనుల ప్రణాళికలు రూపొందించింది. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రూ.2,200 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 10 ప్రముఖ ఆలయాల అభివృద్ధి చేయనున్నది. అదేవిధంగా, రూ.779.74 కోట్ల సీజీఎఫ్ నిధులతో 1,979 ఆలయాల్లో సౌకర్యాల కల్పించనున్నది.
నాలుగు దశల్లో అభివృద్ధి పనులు
భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎండోమెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. రహదారుల విస్తరణ, అన్నదాన సత్రాలు, వసతిగృహాలు, క్యూలైన్ కాంప్లెక్స్‌లు, మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి పలు పనులు చేపట్టనున్నది. రద్దీ సమయాల్లో ఇబ్బందులు తొలగించేందుకు క్యూలైన్లు, లైట్లు, శాశ్వతంగా ఉండేలా మండపాలు ఏర్పాటు చేయనున్నారు.
అన్నదాన సత్రాల ద్వారా భక్తులకు ఆహార సౌకర్యం, వసతిగృహాలతో బస సౌకర్యం కల్పించనున్నారు. ఈ అభివృద్ధి పనులు 4 దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో రహదారుల విస్తరణ, రెండో దశలో వసతిగృహాలు, మూడో దశలో అన్నదాన సత్రాలు, నాల్గో దశలో క్యూలైన్ కాంప్లెక్స్‌ల నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఎండోమెంట్ శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, కొడంగల్ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం, అలంపూర్‌లోని జోగుళాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయం, కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, చెర్వుగట్టు పార్వతీజడల రామలింగేశ్వరస్వామితో పాటు మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయాన్ని ఎంపిక చేశారు.
మాస్టర్ ప్లాన్ రెడీ.. ఆమోద ముద్రే తరువాయి..
భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని 3 దశల్లో రూ.350 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్లాన్ సిద్ధం చేశారు. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం రూ.696.25 కోట్లు, జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంకు రూ.345 కోట్లు, కీసరలోని రామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.202 కోట్లు, కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయానికి రూ.200 కోట్లు, బాసరలోని జ్ఞానసరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూ.189.10 కోట్లు, కొడంగల్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.110 కోట్లు, చెర్వుగట్టులోని పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం రూ.110 కోట్లతో ఎస్టిమేషన్స్ వేశారు.
ఇందులో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.696.25 కోట్లతో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ టెంపుల్‌ను 4 దశల్లో అభివృద్ధ చేయనున్నారు. మిగిలిన ఆలయాలతో పాటు ములుగు సమ్మక్క సారక్క వద్ద అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ లను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. సీఎం ఆమోదించిన వెంటనే పనులను ప్రారంభించనున్నారు.
అదేవిధంగా, సీజీఎప్ (సర్వశ్రేయోనిధి), ఇతర శాఖల నిధులు మొత్తం రూ.779.74 కోట్లతో ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సీజీఎఫ్ ఎయిడ్ నిధులు రూ.502.17 కోట్లను 1,979 ఆలయాలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎస్డీఎఫ్ వర్క్స్ రూ.64.46 కోట్లతో 48 ఆలయాలు, ఆర్అండ్ ఆర్ వర్క్స్ కింద రూ.7.86 కోట్లతో 24 ఆలయాల్లో పనులకు శ్రీకారం చుట్టారు.