సరి-బేసి నిబంధన ఉల్లంఘిస్తే రూ. 4 వేలు జరిమానా : కేజ్రీవాల్‌

సరి-బేసి నిబంధన ఉల్లంఘిస్తే రూ. 4 వేలు జరిమానా : కేజ్రీవాల్‌

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన సరి- బేసి విధానాన్ని ఉల్లంఘించిన వారికి 4 వేల రూపాయిల జరిమానా విధించనున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. నవంబర్‌ 4నుంచి 15వ తేదీ వరకూ ఈ విధానం అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ఈ విధానం అమలులో ఉన్న కాలంలో… రోజూ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మొత్తం 12 గంటల పాటు ఈ నిబంధన అమల్లో ఉంటుందన్నారు.

సరి-బేసి సంఖ్యల విధానం తనతో సహా మొత్తం ఢిల్లీ మంత్రులందరికీ వర్తిస్తుందని స్పష్టంచేసిన సీఎం కేజ్రీవాల్… రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలకు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు జడ్జిలు, ఎలక్షన్‌ కమిషనర్‌, కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌లకు ఈ విధానం నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.

ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే రూ.4వేలు జరిమానా విధించనున్నట్టు హెచ్చరించారు కేజ్రీవాల్. 2016లో రూ.2000గా ఉన్న ఈ జరిమానాను రూ.4వేలకు పెంచారు. నవంబర్‌ 10 (ఆదివారం) రోజున దీనికి మినహాయింపు ఉంటుందన్నారు. అయితే, ఈ విధానం కేవలం నాలుగు చక్రాల వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని.. ద్విచ్రవాహనాలకు కాదన్నారు.

ఈ విధానం అమల్లో ఉన్న సమయంలో బేసి సంఖ్య తేదీల్లో బేసి సంఖ్య ఉన్న వాహనాలు, సరి సంఖ్య తేదీల్లో సరి సంఖ్య ఉన్న వాహనాలు రోడ్లపై తిరగడానికి అనుమతిస్తారు.