రూ.52 కోట్ల ఫ్రాడ్ కేసులోనిందితుడు అరెస్ట్..భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసులు35 వాహనాలు స్వాధీనం

రూ.52 కోట్ల ఫ్రాడ్ కేసులోనిందితుడు అరెస్ట్..భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసులు35 వాహనాలు స్వాధీనం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మాయమాటలతో రూ. 52 కోట్లు వసూలు చేసిన వ్యక్తిని భద్రాద్రికొత్తగూడెం పోలీసులు అరెస్ట్​ చేశారు. శనివారం లక్ష్మీదేవిపల్లి పోలీస్​స్టేషన్​లో కొత్తగూడెం డీఎస్పీ ఎల్.ఆదినారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన బేతంపూడి భరత్​ సారపాకలోని ఐటీసీ పేపర్​ బోర్డులో లేబర్​ కాంట్రాక్టర్​గా పని చేస్తున్నట్లు పలువురిని నమ్మించాడు.

 తనతో కలిస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. బీకే నాయుడు అండ్​ కో, రాజేశ్వరీ ట్రావెల్స్​ పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి, కాంట్రాక్టులు, నకిలీ సంస్థల్లో పెట్టుబడులు పెడితే తక్కువ టైంలో పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని చెప్పి రూ.52 కోట్లు వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్న వారిని నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు సృష్టించి ఇచ్చాడు.

 లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన బరపాటి శ్రీనివాసరావు కంప్లైంట్​ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీలను విశ్లేషించి కేరళలోని పాలా ప్రాంతంలో భరత్​ను అరెస్ట్​ చేసి ట్రాన్సిట్​ వారెంట్​పై జిల్లాకు తీసుకువచ్చినట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుంచి ఆరు బస్సులు, ఒక వాటర్​ ట్యాంకర్, మూడు ట్రాక్టర్లు, రెండు వ్యవసాయ పరికరాలు, ఏడు కార్లు, 14 టూ వీలర్లు, రెండు ట్రైలర్లతో కలిపి 35 వెహికల్స్​ స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలో మూడంతస్తుల బిల్డింగ్, ప్లాట్​ ఉన్నట్టు గుర్తించామన్నారు. చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు