
- అధికార పార్టీకి అసంతృప్తుల షాక్!
- బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతలు
- ఫలించని బుజ్జగింపులు, ఆఫర్లు
- మైనంపల్లి దారిలోనే బోథ్, ఉప్పల్ ఎమ్మెల్యేలు?
- పోటీ విషయంలో తగ్గేది లేదంటున్న
- తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి
హైదరాబాద్/నెట్ వర్క్, వెలుగు : బీఆర్ఎస్‌కు అసంతృప్తుల షాక్ తగులుతున్నది. కీలక నేతలు బుజ్జగిస్తున్నా.. ఆఫర్లు ఇస్తున్నా నేత లు వెనక్కి తగ్గడం లేదు. కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన వస్తుండడంతో బీఆర్‌ఎస్‌ను ఒక్కొక్కరుగా వీడుతున్నారు. తనకు టికెట్ కన్ఫర్మ్ చేసినప్పటికీ.. తన కుమారుడి విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై మండిపడ్డ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అదే బాటలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో టికెట్ దక్కని బోథ్, ఉప్పల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్‌లోని పెద్దలను కలిసి టికెట్ తమకే ఇవ్వాలని అడిగితే స్పందన లేకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ను ఖరారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. జనగామ, స్టేషన్ ఘన్‌ఫూర్ టికెట్ల విషయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య తాము రేస్‌లోనే ఉన్నట్లు ప్రకటించుకున్నారు. దీంతో కారులో కలవరం మొదలైంది.
కారు దిగేందుకే మొగ్గు
బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ టికెట్లను ప్రకటించి నెల దాటుతున్నది. తమకు టికెట్ దక్కకపోవడంతో జన గామ, స్టేషన్ ఘన్పూర్, ఖానాపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. తర్వాత ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేరుతో కాంగ్రెస్ టికెట్ కోసం అప్లికేషన్ వెళ్లింది. తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నిరసన చేపట్టారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి రాజయ్య కూడా తనకు కాకుండా కడియం శ్రీహరికి టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకించారు. అసంతృప్త నేతలిద్దరినీ ఇటీవల కేటీఆర్ పిలిపించుకుని మాట్లాడారు. ఒకరికి రైతు సమన్వయ సమితి చైర్మన్, ఇంకొకరికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, అందుకు వాళ్లు ఓకే అన్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాతి రోజే వాటిని రాజయ్య, ముత్తిరెడ్డి ఖండించారు. ఇప్పుడు వీళ్లు పార్టీ నుంచి బయటకు వచ్చి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. టికెట్ ఇస్తామని గ్యారంటీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రెడీ అనే సంకేతాలు పంపినట్లు తెలిసింది. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.
అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడంతో..
తాను పార్టీ మారుతున్నట్లు ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే బాపురావు సోమవారం వెల్లడించారు. బీఆర్ఎస్ టికెట్ నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ కు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న బాపురావు ఇటీవల కేటీఆర్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండి ప్రయత్నించినా కేటీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో కలత చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అనుచరులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ క్రమంలో బాపురావు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతున్నది.
హామీ ఇస్తే కాంగ్రెస్‌లోకి..
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన పొలిటికల్ స్టాండ్ పై రివర్స్ గేర్ వేశారు. తనను కాదని శ్రీహరికి అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో ఓ రేంజ్లో మాటల తూటాలు పేల్చిన ఆయన కాంగ్రెస్ తో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో సంప్రదింపులు జరిపినా.. సరైన హామీ లభించకపోవడంతో డైలమాలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదే టైమ్‌లో కేటీఆర్ నుంచి పిలుపు రావడం, రాజయ్య– కడియం మధ్య సయోధ్య కుదిర్చడం వంటివి జరిగాయి. కానీ ఆ మరుసటిరోజే తానే పోటీలో ఉంటానని రాజయ్య ప్రకటించారు. రైతుబంధు సమితి చైర్మన్ అవకాశం ఇస్తామని కేటీఆర్ ఇచ్చిన హామీతో రాజయ్య మెత్తబడినా.. లోకల్‌గా తన అనుచరుల ఒత్తిడితోనే మాట మారుస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. తాను పార్టీ మారనని రాజయ్య చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్ నుంచి హామీ లభిస్తే ఆ పార్టీ నుంచి బరిలో ఉంటారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
కసిరెడ్డికి కల్వకుర్తి ఆఫర్
నాగర్కర్నూల్జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్నారు. ఈసారి కూడా టికెట్ జైపాల్‌యాదవ్‌కే ప్రకటించడంతో ఆయన నారాజ్ అయ్యారు. ఈ క్రమంలో నారాయణ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు కల్వకుర్తి టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలిసింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపుతో శుక్రవారం ప్రగతిభవన్‌కు వెళ్లిన నారాయణరెడ్డి.. కేసీఆర్, కేటీఆర్‌లను కలవకుండానే వెనుదిరిగారు. తిరిగి వారిని కలిసే అవకాశం లేదని తన సన్నిహితులతో ఆయన చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఆఫర్‌కు ఓకే చెప్పాలని నారాయణరెడ్డి మీద అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. మంత్రి కేటీఆర్ ఆయన్ను సోమవారం ప్రగతి భవన్ కు పిలిపించారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తీరుపై ఫిర్యాదు చేసిన కసిరెడ్డి.. ఆయనతో కలిసి పని చేయలేమని వివరించినట్లు తెలిసింది. అయితే సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం రాగా.. హడావుడిగా వెళ్లిన కేటీఆర్ రెండు రోజులు టైమ్ ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం.
కేసీఆర్‌పై విమర్శలు.. రేవంత్‌పై పొగడ్తలు
బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గుడ్‌బై చెప్పడం ఖాయమని తెలుస్తున్నది. తాను కేసీఆర్‌ను నమ్మి మోసపోయానని, ఆరునెలలుగా కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపణలు చేశారు. దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్అని తీవ్ర విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు తమ్ముడి లాంటివాడని, ఆయన అధ్యక్షుడు అయిన తర్వాతే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందని చెప్పారు. దీంతో కాంగ్రెస్‌లో మోత్కుపల్లి చేరతారనే ప్రచారం జరుగుతున్నది. తుంగతుర్తి నుంచి గానీ, ఆలేరు నుంచి గానీ టికెట్‌ను మోత్కుపల్లి ఆశిస్తున్నారు.