ఫిబ్రవరిలో ఆర్టీసీ కార్గో బస్సులు

ఫిబ్రవరిలో ఆర్టీసీ కార్గో బస్సులు

50  కార్గో బస్సులను  ప్రారంభించనున్న సీఎం
అక్టోబర్‌‌‌‌ నాటికి మొత్తం 820 బస్సులు సిద్ధం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:ఆర్టీసీలో ఆదాయాన్ని పెంచుకునేందుకు తెస్తున్న కార్గో బస్సులు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. ఈ నెలలోనే కార్గోను  ప్రారంభించాలనుకున్నా బస్సులు తయారు కాకపోవడంతో ఆలస్యమవుతున్నట్టు తెలిసింది. ఇటీవల గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ పరిధిలో తగ్గించిన 800 బస్సులతో కలిపి మొత్తం 820 బస్సులను సరుకుల రవాణాకు ఉపయోగించనున్నారు. మియాపూర్‌‌‌‌ బస్‌‌‌‌ బాడీ వర్క్‌‌‌‌షాపులో వీటిని రెడీ చేస్తున్నారు. ఒక్కో బస్సుకు లక్ష దాకా ఖర్చు వస్తోంది. 50 బస్సులను కార్గో అవసరాలకు తగ్గట్టు మార్చగానే సీఎం కేసీఆర్​ చేతుల మీదుగా  ఈ సర్వీసులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.  ఇప్పటికి  8 బస్సులు మాత్రమే సిద్ధమైనట్లు తెలిసింది.  మొత్తం 820 బస్సులు తయారు కావాలంటే అక్టోబర్‌‌‌‌ దాకా టైం పడుతుందంటున్నారు. కార్గో సర్వీసుల్లో  1210మంది సిబ్బంది పని చేయనున్నారు.  మార్కెటింగ్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌లుగా పని చేసేవారికి ఇప్పటికే ఇంటర్వ్యూలు కూడా చేశారు. మొదట ప్రభుత్వశాఖలకు సంబంధించి సరుకుల రవాణా చేయాలని భావిస్తున్న అధికారులు  సివిల్‌‌‌‌ సప్లయిస్‌‌‌‌, ఆబ్కారీ, విద్యాశాఖలతో మాట్లాడనున్నారు. సేవలను ప్రారంభించేలోగా చార్జీలను నిర్ణయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్​ కార్గో సంస్థలు వసూలు చేస్తున్న చార్జీలపై అధ్యయనం చేస్తున్నారు.

కార్గో బస్సులపై ఎండీ సమీక్ష..

కార్గో పార్సిల్‌‌‌‌ సర్వీసుల నిర్వహణపై  ఆర్టీసీ ఎండీ సునీల్‌‌‌‌ శర్మ మంగళవారం బస్‌‌‌‌ భవన్‌‌‌‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు.  కార్గో సర్వీసు సేవలకు సంబంధించి ఆయన అధికారులకు సూచనలు చేశారు. మొదట  తెలంగాణ,  ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కార్గో సేవలను అందించాలని భావిస్తున్నట్టు  సునీల్‌‌‌‌ శర్మ చెప్పారు. నష్టాల్లో ఉన్న సంస్థకు కార్గో ద్వారా  ఆదాయం వచ్చేలా  ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.  పార్సిల్స్‌‌‌‌ బుకింగ్స్‌‌‌‌ కోసం ప్రభుత్వ,  ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేట్‌‌‌‌ కంపెనీలను సంప్రదించాలన్నారు. ఈడీ (రెవెన్యూ) పురుషోత్తం కార్గో సర్వీసు సేవలపై రూపొందించిన యాక్షన్​ ప్లాన్​ను పవర్‌‌‌‌ పాయింట్‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌ ద్వారా వివరించారు. సమావేశంలో ఈడీలు వినోద్‌‌‌‌, టీవీరావు, యాదగిరి, ఫైన్సాన్షియర్‌‌‌‌ అడ్వయిజర్‌‌‌‌ రమేశ్‌‌‌‌ పాల్గొన్నారు.