
- పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని
- 11 డిపోల్లో అమలుకు నిర్ణయం
- ఇది సక్సెస్ అయితే రాష్ట్రమంతటా అమలు చేసే అవకాశం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సు ప్రమాదాలను తగ్గించేందుకు యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డ్రైవింగ్ సమయంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు సెల్‌ఫోన్లను నిషేధించింది. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ల వద్ద సెల్ ఫోన్లను నిషేధించాలని యాజమాన్యం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 11 డిపోల్లో దీనిని అమలు చేయనున్నారు.
ఇక్కడ వచ్చే ఫలితాలకనుగుణంగా రాష్ట్రమంతటా అమలు చేసే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 97 ఆర్టీసీ డిపోలు ఉండగా.. పైలెట్ ప్రాజెక్టు కింద 11 డిపోలను ఎంచుకున్నారు. ఎంపిక చేసిన డిపోల్లో డ్రైవర్లు విధుల్లో చేరే ముందు తమ సెల్ ఫోన్లను డిపోలోని మేనేజర్లకు అప్పగించాలి. డ్యూటీ ముగిసిన తర్వాత మళ్లీ వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అత్యవసర సమాచారం డ్రైవర్లకు అందించాలంటే ఆ బస్సులోని కండక్టర్ల మొబైల్ నంబర్‌కు ఫోన్ చేస్తారు. ఈ ప్రాజెక్టు ఫలితాలను విశ్లేషించుకొని, తర్వాత రాష్ట్రమంతటా అమలు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోనుంది.