
రామకృష్ణాపూర్ (మంచిర్యాల), పెద్దపల్లి, వెలుగు: ఆర్టీసీ కార్మికులను ఏ చట్టం ప్రకారం డిస్మిస్ చేస్తారో, ఏ చట్టం ప్రకారం జీతాలు ఇవ్వరో చెప్పాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత జి.వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. లేబర్ కోర్టు కార్మికుల వైపు ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసే కుట్ర జరుగుతోందని, అందుకే 40 రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదన్నారు. కార్మికుల పాలిట భస్మా సురుడిలా మారారని దుయ్యబట్టారు. గాంధీ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో వివేక్ పాదయాత్ర చేశారు. తర్వాత సూపర్‌బజార్ చౌరస్తాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
జనంపైనే తప్పుడు కేసులు
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన జనంపైనే సీఎం తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, ఆర్టీసీ విషయంలో బాధ్యత లేకుండా పంతానికి పోతున్నారని వివేక్ విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే టికెట్ల భారం ప్రజలపైనే పడుతుందన్నారు. ‘‘ఎలాంటి పదవులు వద్దంటివి. కాపలా కుక్కలా ఉంటానంటివి. ఏమైంది? ఎందుకు మాట తప్పావు? కొందరు సన్నాసులు ఆంధ్రోళ్లకు కాంట్రాక్టులు కట్టుబెడుతున్నారని ఉద్యమ సమయంలో రెచ్చగొట్టావు. ఇప్పుడు ఆ సన్నాసి పనులే మీరు చేస్తున్నరు” అని మండిపడ్డారు.
కల్వకుంట్ల సామ్రాజ్యంగా మార్చినవ్
తనకు పదవే వద్దన్న కేసీఆర్.. ఇవాళ సీఎం కుర్చీని వదలడం లేదని వివేక్ ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల సామ్రాజ్యంగా తెలంగాణ మారిందన్నారు. కొడుక్కు రెండు పోస్టులు, చుట్టాలకు కేబినెట్ హోదా పదవులు, చివరికి టీటీడీ మెంబర్లుగా ముగ్గురు కుటుంబ సభ్యులనే నియమించుకున్న ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. కేంద్రం రెండు లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కనీసం పదివేల ఇళ్లు కూడా కట్టించలేని సీఎం.. తన కొడుకు కోసం రూ.100 కోట్లతో ప్రగతిభవన్ కట్టించారని ఆరోపించారు. కేంద్రం నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించారని, ఆ కాంట్రాక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి కమీషన్లు కొట్టేశారని ఆరోపించారు. ఈ డబ్బులతోనే ఎమ్మెల్యేలను కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు.
ఆర్టీసీ తర్వాత సింగరేణి
ఆర్టీసీ సంస్థను ప్రైవేటు పరం చేసిన తర్వాత కేసీఆర్ కన్ను సింగరేణిపై పడుతుందని వివేక్ ఆరోపించారు. సింగరేణికి విద్యుత్ సంస్థల నుంచి వచ్చే రూ.9 వేల కోట్లను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించారని పేర్కొన్నారు. కారుణ్య నియామకాల పేరుతో సింగరేణి కార్మికుల కుటుంబాల్లో చిచ్చుపెట్టారని, వంద మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 30 మందికి మాత్రమే వస్తున్నాయని మండిపడ్డారు. సంకల్పయాత్రలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ముల్కల మల్లారెడ్డి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల ఇన్చార్జీలు అందుగుల శ్రీనివాస్, రఘునాథ్ వెరబెల్లి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరుముల్ల పోశం, సీనియర్ నాయకులు దీక్షితులు, గుత్తుల ప్రసాద్, పెద్దపల్లి పురుషోత్తం పాల్గొన్నారు.
సీఎంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చెయ్యాలె
25 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్ఇచ్చిన ఐఏఎస్‌లను కోర్టు ప్రాసిక్యూషన్ చేయాలని వివేక్‌వెంకటస్వామి డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. గతంలో సెక్రటేరియెట్ విషయంలో పంతానికి పోయారని, ఇప్పుడు ఆర్టీసీ విషయంలోనూ మొండిగా వ్యవరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 70 శాతం పైపులైన్లు ఉన్నప్పటికీ మిషన్ భగీరథకు 46 వేల కోట్లు కేటాయించి కమీషన్లు దండుకున్నారన్నారు. లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందని, కార్మికులు ధైర్యంగా ఉండాలన్నారు.