ఎన్నికలు లేకుండా త్వరలో ఆర్టీసీ కొత్త పాలకవర్గం

ఎన్నికలు లేకుండా త్వరలో ఆర్టీసీ కొత్త పాలకవర్గం
  • ఆర్టీసీ బోర్డులో సంఘాల ప్రతినిధులకు నో ప్లేస్‌‌‌‌
  • రెండేండ్లపాటు నో ఎలక్షన్స్ అన్న కేసీఆర్.. నెల రోజుల్లో గడువు పూర్తి 
  • ఈ నెలలోనే ముగియనున్న ఆర్టీసీ సీసీఎస్ పాలకవర్గం పదవీకాలం 
  • దానికీ ఎన్నికలు లేకుండా ప్లాన్.. కొత్తగా పీఏసీ కమిటీ ఏర్పాటుకు యోచన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆర్టీసీ యూనియన్‌‌‌‌ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఈసారి కూడా ఎలక్షన్స్‌‌‌‌ నిర్వహించేందుకు ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపడంలేదని తెలుస్తోంది. ఇటీవల టీఎస్ ఆర్టీసీ చరిత్రలో ఫస్ట్‌‌‌‌ టైం ఏర్పాటు చేసిన బోర్డు కమిటీలో మెంబర్స్‌‌‌‌లో గుర్తింపు యూనియన్‌‌‌‌ను చేర్చకపోవడంతో దీనికి మరింత బలం చేకూరుస్తోంది. సంస్థలో రెండేండ్ల పాటు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రకటించి రెండేండ్లు కావస్తోంది. మరోవైపు ఈ నెలలో ముగియనున్న ఆర్టీసీ సీసీఎస్‌‌‌‌ పాలకవర్గం ఎన్నికలను కూడా పక్కనబెట్టే ప్లాన్‌‌‌‌ చేస్తున్నట్లు తెలిసింది. దీని ప్లేస్‌‌‌‌లో ఆర్టీసీకి అనుకూలంగా ఉండటానికి పీఏసీ కమిటీని ఏర్పాటు చేయడంపై యోచిస్తున్నట్లు సమాచారం.  

మూడేండ్లు దాటినా.. 
ఆర్టీసీలో గుర్తింపు సంఘం గడువు ముగిసి మూడేండ్లు దాటినా నేటికీ ఎన్నికల ఊసు లేదు. సాధారణంగా రెండేండ్లకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. గత ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్‌‌‌‌ యూనియన్‌‌‌‌ (టీఎంయూ) గెలిచింది. 2018 ఆగస్టు 7న టీఎంయూ గుర్తింపు ముగిసింది. అప్పటినుంచి ఆర్టీసీలో గుర్తింపు సంఘం లేకుండా పోయింది. మొదట ఎన్నికలు నిర్వహించాలని భావించినా వాయిదా పడుతూ వచ్చింది. తర్వాత 2019లో సమ్మెతో యూనియన్లపై సీఎం ఫైర్‌‌‌‌ అయ్యారు. సంస్థలో రెండేండ్ల దాకా ఎన్నికలు ఉండబోవని తేల్చిచెప్పారు. అయితే గుర్తింపు యూనియన్‌‌‌‌ లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆర్టీసీ సంఘాల నేతలు అంటున్నారు. రెండు పే స్కేల్స్‌‌‌‌, ఐదు డీఏలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. 2015 బాండ్ల డబ్బులు చెల్లించడంలేదు. రిటైర్‌‌‌‌ అయినోళ్లకు సరిగా బెనిఫిట్స్‌‌‌‌ ఇవ్వడంలేదు. సీసీఎస్‌‌‌‌లో ఇంకా 700 కోట్ల బకాయిలు ఉన్నాయి. పీఎఫ్‌‌‌‌ డబ్బులు సొంతానికి వాడుకుని చెల్లించడం లేదు. ఇలా అనేక సమస్యలు పేరుకుపోయాయి. యూనియన్లు ఉంటే వీటిపై ప్రభుత్వం, యజమాన్యం దృష్టికి తీసుకెళ్లే చాన్స్‌‌‌‌ ఉంటుందని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సంఘాల నేతలు కోరుతున్నారు. 

బోర్డులో యూనియన్లకు నో ప్లేస్‌‌‌‌ 
తెలంగాణ వచ్చాక ఏడున్నరేండ్లకు ఇటీవల 9 మందితో బోర్డు ఏర్పాటు చేశారు. గతంలో గుర్తింపు యూనియన్‌‌‌‌ లీడర్‌‌‌‌ను తప్పకుండా బోర్డులో నియమించేవారు. సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు బోర్డు తీర్మానం అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుత బోర్డులో కార్మిక సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించలేదు. దీంతో సంస్థ ఉన్నతాధికారులపై యూనియన్‌‌‌‌ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై న్యాయం పోరాటం కూడా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. 

‘సీసీఎస్‌‌‌‌’ ఎన్నికలూ అటకెక్కినట్లే..
ఆర్టీసీ సీసీఎస్‌‌‌‌ పాలక వర్గం ఎన్నికలను కూడా ఇలాగే అటకెక్కిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరుతో సీసీఎస్‌‌‌‌ పాలకవర్గం పదవీకాలం ముగుస్తుంది. సాధారణంగా డిపోల్లో సీసీఎస్‌‌‌‌ ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరంతా కలిసి సీసీఎస్‌‌‌‌ పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. ఇందులో ఆర్టీసీ ఉన్నతాధికారులు, యూనియన్‌‌‌‌ లీడర్లు ఉంటారు. ఇటీవల కాలంలో సీసీఎస్‌‌‌‌ సమస్యలు పరిష్కరించాలని పాలకవర్గం ఆర్టీసీపై ఒత్తిడి తెచ్చింది. హైకోర్టు తలుపు కూడా తట్టింది. ఏకంగా బస్‌‌‌‌ భవన్‌‌‌‌ ఎదుట ధర్నాలు సైతం చేపట్టింది. దీంతో సీసీఎస్‌‌‌‌ పాలకవర్గం ఎన్నికలను కూడా పక్కనపెట్టాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ప్లేస్‌‌‌‌లో సంస్థకు అనుకూలంగా ఉండేలా పీఏసీ కమిటీని నియమించనున్నట్లు తెలిసింది. ఒకవేళ పీఏసీ కమిటీ వేయకపోతే ఇప్పుడున్న పాలకవర్గాన్నే కొనసాగించే చాన్స్‌‌‌‌ ఉందని, కొత్తగా ఎన్నికలు మాత్రం పెట్టరని బస్‌‌‌‌ భవన్‌‌‌‌లో ప్రచారం జరుగుతోంది. 

యూనియన్‌‌‌‌ ఎన్నికలు నిర్వహించాలి 
టీఎంయూ పదవీ కాలం ముగిసి మూ డేండ్లు దాటింది. కానీ యూనియన్‌‌‌‌ ఎన్నికలు మాత్రం నిర్వహించడంలేదు. సమ్మె టైంలో రెండేండ్ల దాకా ఎన్నికలు ఉండ బోవని కేసీఆర్‌‌‌‌ చెప్పారు. ఇప్పు డు రెండేండ్లు కావస్తోంది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. బోర్డులో కూడా కార్మిక సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించలేదు. ఇది సరికాదు. 
- కె.హనుమంతు, టీజేఎంయూ, ప్రధాన కార్యదర్శి