తడాఖా చూపిస్తం: రాష్ట్ర సర్కార్​కు ఆర్టీసీ, అఖిలపక్ష నేతల హెచ్చరిక

తడాఖా చూపిస్తం: రాష్ట్ర సర్కార్​కు ఆర్టీసీ, అఖిలపక్ష నేతల హెచ్చరిక

అవసరమైతే మరో మిలియన్ మార్చ్

ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకు కేసీఆర్ ​కుట్ర

ఏపీలో విలీనం చేసిన్రు.. మన దగ్గర ఎందుకు కాదు

బలిదానాలొద్దుబరి గీసి కొట్లాడుదాం

సకల జనభేరిలో నేతలు.. భారీగా తరలివచ్చిన కార్మికులు

సభలోనే గుండెపోటుతో కుప్పకూలి డ్రైవర్ మృతి

నేడు అన్ని డిపోల వద్ద 24 గంటల దీక్ష 

రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే తడాఖా చూపిస్తామని ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు ముక్తకంఠంతో హెచ్చరించారు. ట్యాంక్​ బండ్​పై మరో మిలియన్ మార్చ్​కు వెనకాడబోమని తేల్చిచెప్పారు. సర్కార్​ ఇదే నియంతృత్వ  పోకడలకు పోతే మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి చూపిస్తామని నినదించారు. పక్క రాష్ట్రం ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు మనదగ్గర  ఎందుకు సాధ్యంకాదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని నిర్బంధాలు పెట్టలేదని మండిపడ్డారు. అసలు ఆర్టీసీ నష్టాల్లో లేదని, ప్రభుత్వమే నష్టాల్లోకి నెట్టిందన్నారు. సీఎం కేసీఆర్​ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టి, బంధువులు, అనుచరులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. తమ జెండాలు, పార్టీలు వేరైనా అజెండా మాత్రం ఒక్కటేనని చెప్పారు. కార్మికులెవరూ అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా సమ్మె విరమించవద్దని, తాము,  తెలంగాణ సమాజం అండగా ఉంటామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్​ స్టేడియంలో బుధవారం ‘సకల జనభేరి’ సభను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నిడిపోల నుంచి భారీగా కార్మికులు తరలివచ్చారు. స్టేడియం మొత్తం నిండిపోగా.. పరిసరాల్లో కూడా ఎక్కడ చూసినా కార్మికులే కనిపించారు. సర్కార్​ తీరువల్ల చనిపోయిన 16 మంది కార్మికుల పట్ల సంతాపంగా నిమిషంపాటు  మౌనం పాటించారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కాగా.. కోర్టు విధించిన గడువు కంటే (సాయంత్రం 6గంటలకంటే) మూడు నిమిషాల ముందే ముగించారు. కళాకారుల ఆటాపాటలతో స్టేడియం మార్మోగింది.  గురువారం రాష్ట్రవ్యాప్తంగా డిపోల దగ్గర  24 గంటలపాటు దీక్ష చేస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. తమకు మద్దతుగా దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివ రావును గురువారం కలిసి.. దీక్ష విరమింపజేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది. ఎన్ని ఇబ్బందులెదురైనా గమ్యాన్ని చేరే వరకు పోరాటం ఆగదు. పోరాటం హక్కుల కోసం మాత్రమే కాదు.. ప్రజా రవాణాని బతికించుకోవడానికి . ఆర్టీసీ కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయి. కార్మికులను
రెచ్చగొట్టొద్దు. – అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ జేఏసీ చైర్మన్

ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేద్దాం. ట్యాంక్​బండ్​పై మరో మిలియన్​ మార్చ్​కు సిద్ధమవుదాం. కోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు. ప్రగతి భవన్​లో కేసీఆర్ ఒంటరిగా ఉన్నారు.. ఆర్టీసీ కార్మికులతో సమస్త తెలంగాణ సమాజం ఉంది. విజయం కార్మికులదే. – కోదండరాం, టీజేఎస్​ చీఫ్

కేసీఆర్ రాష్ట్రంలో సంస్థలను నిర్వీర్యం చేస్తూ అందరూ కాళ్ల దగ్గరికి రావాలని భావిస్తున్నరు. కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి, కమీషన్లు దొబ్బడానికి డబ్బులు ఉన్నాయి కానీ ఆర్టీసీ కార్మికులకు ఇవ్వడానికి మాత్రం లేవంటే అందరూ నవ్వుతున్నరు. కేసీఆర్ పెద్ద అవకాశవాది అవసరానికి వాడుకొని వదిలేస్తరు. సీఎం సెల్ఫ్ డిస్మిస్ అని ప్రకటించినా, జీతాలు ఇవ్వకున్నా, దసరా, దీపావళి జరుపుకోకున్నా, ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా ఉద్యమిస్తున్న కార్మికుల ఐక్యతకు సలాం.- వివేక్​ వెంకటస్వామి, బీజేపీ నేత

ఆర్టీసీ విలీనం టీఆర్​ఎస్​ మేనిఫెస్టోలో లేదని కేసీఆర్, ఎర్రబెల్లి​ చెప్తున్నరు.. మరి మేఘా కృష్ణారెడ్డికి ఆర్టీసీ ఆస్తులను కట్టబెడతామని మేనిఫెస్టోలో పెట్టారా? . కేసీఆర్​ కుటుంబంలోని వాళ్లే సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అని మేనిఫెస్టోలో పెట్టారా? రాష్ట్రంలో ఏం చేయాలన్నా కోర్టులే చెబుతున్నాయి. అన్నీ కోర్టులే చెబితే మరి సీఎం కేసీఆర్​ ఏం చేస్తున్నారు..? గాడిద పండ్లు తోముతున్నారా? –  రేవంత్​ రెడ్డి, కాంగ్రెస్​ ఎంపీ

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి