ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి.. సీఎం రేవంత్రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని లేఖ

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి.. సీఎం రేవంత్రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని లేఖ
  • పెండింగ్‌‌లో ఉన్న పీఆర్సీలను అమలు చేయాలి
  • లేబర్ కమిషన్ సమావేశానికి యాజమాన్యం రావాలి
  • గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) కార్మికుల సమస్యలను పరిష్కరించి వారు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలన్నారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం మొండివైఖరి వీడాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనకుండా ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అద్దె వాహనాలను ప్రోత్సహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సబ్సిడీలు ప్రైవేట్ వ్యక్తులకు చెందుతున్నాయని, దీనివల్ల సంస్థకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొంటే ఆ ఆదాయం సంస్థకే వస్తుందని సూచించారు.

ఆర్టీసీలో 11 ఏండ్లుగా నియామకాలు లేకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగి వారు అనారోగ్యానికి గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాల నుంచి రికవరీ చేసిన సుమారు రూ.1,200 కోట్ల పీఎఫ్ సొమ్మును యాజమాన్యం రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌‌కు జమ చేయలేదని ఆరోపించారు. దీని వల్ల ఐదేండ్లుగా రిటైర్ అయినవారికి హయ్యర్ పెన్షన్లు అందడం లేదని తెలిపారు. 

ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు నేపథ్యంలో ఈనెల 9న లేబర్ కమిషన్ వద్ద జరగాల్సిన సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం హాజరుకాకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. సోమవారం జరిగే సమావేశానికైనా యాజమాన్యం హాజరై కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.