ఆర్టీసీ జేఏసీ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. సమ్మె ప్రభావంతో బుధవారం అర్థరాత్రినుంచి బస్సులు బంద్ అయ్యాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులుఅయితే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా, జనం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఇదే మొదటి సమ్మె. దీంతో సగటు ప్రయాణికులపై సమ్మె ప్రభావం పడకుండా రవాణా శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తమకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలను కోరింది. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో సమ్మె అనివార్యమైంది.
మంగళవారం ఉదయం నుంచి సమ్మె నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే మంగళవారం మధ్యాహ్నం నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ కమిటీకి రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ చైర్మన్ గా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కన్వీనర్ గా, సభ్యులుగా కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ప్రభుత్వం నియమించింది.
ఈ కమిటీ నియామక ప్రకటన వెలువడిన వెంటనే... చర్చలకు రావాల్సిందిగా జేఏసీ నేతలను ఐఏఎస్ అధికారులు ఆహ్వానించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సెక్రటేరియట్ లో ఆర్టీసీ జేఏసీ నేతలతో ఈ కమిటీ చర్చలు ప్రారంభించింది. రాత్రి 9. 30 వరకు పలు సమస్యలపై చర్చలు సాగినా.. చివరకు పలు డిమాండ్లపై కమిటీ నుంచి జేఏసీ నేతలకు స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో చర్చల నుంచి జేఏసీ నేతలు బయటకు వచ్చారు. ఆ వెంటనే ముందుగా నిర్ణయించిన ప్రకారం సమ్మె కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కార్మికులంతా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు.
పత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి..
కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా, ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు. ప్రజా రవాణా స్తంభించకుండా 2,700 అద్దె బస్సులను, మరో 1,000 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీఏ అధికారులను రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు తగిన ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్ర త్త చర్యగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద, బస్సు స్టేషన్ల వద్ద అర్ధరాత్రి నుంచే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ సరికాదు: జేఏసీ చైర్మన్
కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, అందుకే గత్యంతరం లేకనే తాము సమ్మెలోకి వెళ్తున్నట్లు చర్చల అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే తాము నెరవేర్చాలని అడుతుగుతున్నామని, ఇందులో కొత్త డిమాండ్లు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్లను అనుమతించడం, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలనే తమ ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి చర్చలు జరపడం అనేది సరైంది కాదన్నారు.
రవాణా వ్యవస్థను స్తంభింప చేస్తం: కూనంనేని
తమ హక్కుల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సర్కారు సానుకూలంగా ఉంది.. విధులకు రావాలి: ఆర్టీసీ ఎండీ
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని సంస్థ ఎండీ నాగిరెడ్డి మంగళవారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిందని ఆయన తెలిపారు. కార్మికుల డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, మరికొన్ని సంక్లిష్టమైనవి ఉన్నం దున, వాటిని పరిష్కరించడానికి కనీసం 4 వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరిందన్నారు.
కానీ, కొన్ని సంఘాలు వాస్తవాలను విస్మరించి సమ్మెకు పిలుపునిస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించా రు. ఇలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులందరూ విధు లకు హాజరై ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీపైనే ఆధారపడి ప్రయాణించే కూలీలు, చిరు ఉద్యోగులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు.

