V6 News

రెండో రోజూ ఆర్టీసీ సమ్మె..40 శాతం వరకు తిరిగిన బస్సులు

రెండో రోజూ ఆర్టీసీ సమ్మె..40 శాతం వరకు తిరిగిన బస్సులు
  • అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపించిన ఆర్టీసీ అధికారులు
  • సమ్మెలో భాగంగా డిపోల ముందు ధర్నాల్లో పాల్గొన్న కార్మికులు
  • గ్రామీణ ప్రాంత రూట్లలో ప్రజలకు తప్పని తిప్పలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె రెండోరోజు కొనసాగింది. మొదటిరోజుతో పోల్చుకుంటే రెండో రోజు బస్సులు ఎక్కువగానే తిరిగాయి. మొదటి రోజు కేవలం అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే రోడ్లపైకి రాగా.. రెండో రోజు మాత్రం వీటితో పాటు అదనంగా ఆర్టీసీ బస్సులు కూడా తిరిగాయి. ఆయా డిపోల్లో ఉన్న ఆర్టీసీ బస్సుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రైవేట్ డ్రైవర్లను విధుల్లోకి చేర్చుకున్న అధికారులు వారితో బస్సులను నడిపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రూట్లతో పాటు ఇతర రూట్లలోనూ బస్సులు తిరిగాయని బస్ భవన్ అధికారులు ప్రకటించారు. రెండో రోజు సుమారు 40 శాతం వరకు బస్సులు తిరిగాయని అధికారులు వెల్లడించారు. మొదటిరోజుతో  పోల్చుకుంటే రెండోరోజు ప్రయాణికులకు కొంత వరకు ఇబ్బందులు తప్పాయని వారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బస్సుల సంఖ్యను పెంచుతూ పోతామని అధికారులు  అంటున్నారు.

అన్ని డిపోల ముందు కార్మికుల ఆందోళనలు

సమ్మెలో ఉన్న కార్మికులు గురువారం ఉదయం రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే  పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. పలుచోట్ల ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను బయటకు తీయించిన సమయంలో కార్మికులు అడ్డుకున్నారు.

చివరకు పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితులు సద్దుమణిగాయి. కొన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు అనుకున్న స్థాయిలో తిరగకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ వాహనదారులు రెండింతలు ఛార్జీలు వసూలు చేశారు. అయితే, సమ్మె ప్రభావంతో గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన రూట్లతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంత రూట్లలో ఆర్టీసీ బస్సులు  చాలా తక్కువగా కనిపించాయి. దీంతో పాలు, కూరగాయలు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.