- మొదటి రోజు డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ ధర్నాలు
- బస్సులను రానియ్యని కార్మికులు
- పోలీసులతో వాగ్వాదం..అరెస్టులు
వెలుగు నెట్వర్క్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనలు మొదటి రోజైన బుధవారం కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారి తీశాయి. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తూ బస్సులను బయటకు రానివ్వకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. అడ్డుపడుతున్న కార్మికులకు పక్కకు తొలగించే క్రమంలో తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్‌చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.
అద్దె బస్సులను అడ్డుకున్నరు
దిల్సుఖ్ నగర్ డిపో వద్దకు ప్రైవేట్అద్దె బస్సులు చేరుకోవడంతో కార్మికులు డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. డిపో వద్ద టెంట్ వేసేందుకు కార్మికులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. హయత్ నగర్ డిపో ఎదుట కార్మికులు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. దీంతో లీడర్లను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.
బండ్లగూడ, మెహిదీపట్నం, కుషాయిగూడ డిపోల ఎదుట కార్మికులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మహిళలు డిపో ఎదుట బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. షాద్ నగర్ డిపోలో ప్రైవేట్బస్సులను పోలీసులు నడిపించేందుకు యత్నించగా కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
పరిగిలో హై టెన్షన్
పరిగి : పరిగి డిపో నుంచి షాద్‌నగర్‌కు బస్సును నడిపేందుకు మేనేజ్మెంట్ఏర్పాట్లు చేస్తోందని తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డంగా పడుకోవడంతో పోలీసులు పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. కార్మికులను విదిలించే క్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్చెయ్యి ఓ బాలుడి చెంపపై తాకింది. కొద్దిసేపటికి కార్మికులందరినీ అదుపులోకి తీసుకుని రాత్రి వేళ వదిలిపెట్టారు.
బస్సుల బంద్‌తో తగ్గిన రోగుల సంఖ్య
పద్మారావునగర్/అబిడ్స్, వెలుగు: ఆర్టీసీ బస్సుల సమ్మె ప్రభావం గాంధీ, ఉస్మానియా దవాఖానల ఓపీపై పడింది. బస్సులు లేకపోవడంతో రోగుల సంఖ్య భారీగా పడిపోయింది. గాంధీ ఔట్పేషెంట్విభాగానికి సాధారణ రోజుల్లో నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజూ 3 వేలకు పైగా రోగులు వస్తుంటారు. బస్సులు నడవకపోవడంతో బుధవారం ఓపీ సంఖ్య 1,900కు పడిపోయింది. అలాగే, ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఓపీకి ప్రతిరోజూ 2,500 నుంచి 3,000 మంది వరకు వస్తుంటారు. సమ్మెతో ఓపీ బ్లాక్‌లలో రోగుల రద్దీ గణనీయంగా తగ్గిందని సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సాహాయ్ తెలిపారు. బుధవారం కేవలం 1,170 మంది మాత్రమే ఓపీ చూపించుకున్నారని చెప్పారు.

