V6 News

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
  •     గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమే : జాన్ వెస్లీ 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్​చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మెకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 32 డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం వేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరడమంటే సమ్మెను నీరుగార్చడమేనని అన్నారు. తక్షణమే జేఏసీ నాయకులతో చర్చలు జరపాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఆర్టీసీకి రావాల్సిన సుమారు రూ.400 కోట్లతోపాటు ఇతర బకాయిలను చెల్లించాలన్నారు. ప్రభుత్వం నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి, వాటిని పూర్తిగా ఆర్టీసీకే అప్పగించాలన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్​ చేశారు. సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని, వెంటనే కార్మికులతో మాట్లాడి, సమ్మె విరమింపజేయాలని సూచించారు.

కార్మికులను బెదిరిస్తే ఊరుకోం : కూనంనేని  

ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటే వేతనాల్లో కోత విధిస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని యాజమాన్యం బెదిరించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తప్పుపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా వెంటనే కార్మికులను చర్చలకు పిలవాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు ఎంతో కృషి చేశారని  గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ సంస్థల్లో యూనియన్లు ఉన్నప్పుడు, ఆర్టీసీలో ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రస్తుతం ఉన్న కమిటీతోనే పరిష్కరించవచ్చన్నారు. ప్రభుత్వం పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.