హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనే ఉద్యోగుల జీతంలో కోత విధిస్తామని సంస్థ ఎండీ నాగిరెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, ఈ ప్రక్రియ ముగియకముందే సమ్మెకు వెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు.
నిబంధనలను అతిక్రమించిన కార్మికులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల కార్మికుల భవిష్యత్తుతో పాటు వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. కార్మికులు వెంటనే సమ్మెను విరమించి విధులకు హాజరుకావాలని ఎండీ సూచించారు. కార్మికుల సంక్షేమం దృష్ట్యా సమ్మెను విరమించి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

