Rukmini Vasanth: వైరల్ బికినీ ఫోటోలపై రుక్మిణి వసంత్ సీరియస్.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు!

Rukmini Vasanth: వైరల్ బికినీ ఫోటోలపై రుక్మిణి వసంత్ సీరియస్.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు!

ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. సెలబ్రిటీల పాలిట శాపంగా మారుతోంది. లేటెస్ట్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ డీప్‌ఫేక్ మాయాజాలానికి బలయ్యారు. ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రంతో పాటు యశ్ 'టాక్సిక్' లో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు.

బికినీ విజువల్స్‌తో కలకలం..

'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న రుక్మిణికి సంబంధించిన కొన్ని నకిలీ బికినీ విజువల్స్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. గ్రీన్ కలర్ టూ-పీస్ బికినీ ధరించి ఆమె స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నట్లు కొన్ని ఫోటోలు, వీడియో క్లిప్స్ వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు వెండితెరపై ఎంతో పద్ధతిగా, హోమ్లీ లుక్‌లో కనిపించిన రుక్మిణిని ఇలాంటి గ్లామరస్ అవతారంలో చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ షాక్ అయ్యారు.. చుట్టూ కెమెరాలు, లైటింగ్ ఉండటంతో ఇది ఏదైనా కొత్త సినిమా షూటింగ్ అనుకున్నారంతా...  కానీ, అసలు నిజం వేరే ఉంది.

రుక్మిణి సీరియస్

ఈ వైరల్ కంటెంట్‌పై రుక్మిణి వసంత్ తీవ్రంగా స్పందిస్తూ తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నా పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఆ బికినీ చిత్రాలు పూర్తిగా AI ద్వారా సృష్టించిన నకిలీ (Deepfake) ఫోటోలు అని స్పష్టం చేశారు. నా అనుమతి లేకుండా, బాధ్యతారాహిత్యంగా ఇతరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించడం తీవ్రమైన నేరం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

►ALSO READ | తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ రేట్లు పెరగవ్: తేల్చి చెప్పిన తెలంగాణ ఎగ్జిబిటర్స్

సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు..

ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న రుక్మిణి, తన లీగల్ టీమ్‌తో కలిసి సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ ఫోటోలను సృష్టించిన వారిపై, అలాగే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రచారం కల్పిస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు హెచ్చరించారు. అంతేకాకుండా, నెటిజన్లు ఎవరూ ఈ నకిలీ కంటెంట్‌ను షేర్ చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. గతంలో రష్మిక మందన్న, కట్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నటీమణుల  భద్రత కరువవుతుండటంపై ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.