హైదరాబాద్: తెలంగాణలో పెద్ది టికెట్ రేట్లు పెంచేది లేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు ప్రకటించారు. తెలంగాణలో టికెట్ హైక్ కాదని.. ‘టికెట్ రేట్లు పెంచకండి.. ప్రేక్షకుడిని చంపకండి’ అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయమై లెటర్ కూడా ఇచ్చామని చెప్పారు. పెద్ది సినిమాకు ఆంధ్రాలో టికెట్ల రేట్లపై హైక్ ఉంటుందని తెలిపారు.
అంతేకాదు.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమకు పెద్ది సినిమా కూడా పర్సంటేజ్ కావాలని, అది ఎంతో నిర్ణయించాలని.. పర్సంటేజ్ ఇస్తేనే పెద్ది సినిమాను తెలంగాణలో ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తేల్చి చెప్పింది.
తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరపున చివరిగా చెప్పేది ఒకటేనని.. ఇక నుంచి ఏ సినిమా అయినా పర్సంటేజ్ అయితేనే తమ థియేటర్స్లో ఆడనిస్తామని, పెద్ది కాదు ఇక ఏ సినిమా అయినా తమకు పర్సంటేజ్ కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తేల్చి చెప్పింది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పెద్ది అనే పాత్ర ఒక మల్టీ టాలెంటెడ్ అథ్లెట్. క్రికెట్, కుస్తీ, రన్నింగ్.. ఏ ఆట అయినా తన శక్తితో నెగ్గే ఆటగాడిగా చరణ్‌ను చూపించిన తీరు ఆకట్టుకుంది.
►ALSO READ | నిర్మాతల వైఖరిపై ‘ఎగ్జిబిటర్స్’ తిరుగుబాటు.. పర్సంటేజీ ఇస్తేనే సినిమాలు ఆడిస్తామని అల్టిమేటం!
ఊరిలో యువతకు హీరోలా కనిపించే పెద్ది.. గ్రామస్తుల గౌరవాన్ని కూడా సంపాదించుకుంటాడు. అయితే అతని ఎదుగుదల ఒక ఆధిపత్య వర్గానికి నచ్చదు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు.. ఆట, బతుకు, పోరాటం అన్నీ కలిసిన ప్రపంచం అనేలా ట్రైలర్‌ను కట్ చేసిన తీరు సినిమాపై అంచనాలు పెంచుతోంది.
‘మాటలతో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను.. మీరందరు నేను ఆడాను అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారూ..’ అనే డైలాగ్స్‌తో సినిమాలోని డెప్త్‌ను తెలియజేస్తున్నాయి.
