82కు చేరువలో రూపాయి మారకం విలువ

82కు చేరువలో రూపాయి మారకం విలువ

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇవాళ ఉదయం కరెన్సీ ట్రేడింగ్ సెషన్ ఆరంభంలో డాలరుతో రూపాయి మారక విలువ 40 పైసలు తగ్గిపోయి రూ.81.93కు చేరింది. ఇది మన రూపాయికి జీవితకాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంతర్జాతీయ ప్రతికూలతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్, భారత రిజర్వ్ బ్యాంక్ లు వడ్డీరేట్ల పెంపు దిశగా యోచిస్తుండటం కూడా రూపాయి బలహీనతకు దారితీస్తోందని అంటున్నారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీరేట్ల పెంపునకు ఆర్బీఐ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మన దేశంలోని ఫారిన్ రిజర్వ్ (విదేశీ మారక నిల్వలు) వేగంగా తగ్గిపోతున్నాయి. సెప్టెంబరు 16తో ముగిసిన వారంలో భారత దేశ విదేశీ మారక నిల్వలు మరో 5.2 బిలియన్ డాలర్లు తగ్గి 545 బిలియన్ డాలర్లకు చేరాయి. 

రూపాయి బలహీనపడితే.. 

రూపాయి మారకం విలువ తగ్గిపోతే సామాన్య ప్రజల బతుకు భారం అవుతుంది. ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోతుంది. వస్తువుల కొనుగోలుకు, వివిధ సేవలను పొందేందుకు ఎక్కువగా పేమెంట్స్ చేయాల్సి వస్తుంది. అంతర్జాతీయ వ్యాపారానికి మన దేశం డాలర్లలోనే చెల్లింపులు చేస్తుంటుంది. రూపాయి విలువ డౌన్ అయిపోతే.. మనం  మరిన్ని ఎక్కువ డాలర్లను పేమెంట్ కోసం ఇవ్వాల్సి వస్తుంది. ఫలితంగా మన రిజర్వ్ బ్యాంకులో ఉన్న డాలర్ నిల్వలు త్వరగా తగ్గిపోతాయి. ఇక విదేశాల్లో ఉన్నత విద్య,  విదేశీ విహార యాత్రల కోసం వెళ్లేందుకు అయ్యే ఖర్చులు కూడా పెరుగుతాయి. మరోవైపు ఈ పరిణామం ఐటీ, ఫార్మా రంగాల్లోని భారతీయ కంపెనీలకు లాభం చేకూరుస్తాయి. ప్రవాస భారతీయులకూ ఇది ప్రయోజనకరమే.