జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధి మార్గంలో గ్రామ పంచాయతీలే కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందన్నారు.
గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు - అనే సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు సీఎం రేవంత్ . ప్రజాప్రభుత్వం అందుకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. స్థానిక స్వపరిపాలనకు ప్రతీకలైన పంచాయతీలు బలంగా సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు సీఎం.
సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనలో పంచాయతీ రాజ్ సంస్థలు సాధికారత, సామర్థ్యం, జవాబుదారీతనం పెంపొందించుకోవడం అత్యంత అవసరమని చెప్పారు. స్థానిక స్వయం పరిపాలన గ్రామీణ ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులతో పాటు స్వయం సమృద్ధి దిశగా గ్రామీణ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుందని తెలిపారు సీఎం.

